జనగణన-2027 మొదటి దశలో స్వీయ గణనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. *ప్రతి పౌరుడు స్వీయ గణనలో పాల్గొనడం బాధ్యత గా భావించాలి. *ఏప్రిల్ 16 నుండి 30 వరకు 15 రోజుల పాటు స్వీయ గణన పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం, ఏప్రిల్ 14: దేశవ్యాప్తంగా నిర్వహించబడనున్న జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో స్వీయ గణన ( సెల్ఫ్ ఎన్యుమురేషన్ -Self Enumeration) ప్రక్రియకు ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత అవసరమని జీవీఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం సూచనల మేరకు, స్వీయ గణన ప్రక్రియను సులభతరం చేయుటకు https://se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడినదని, పౌరులందరూ ఈ స్వీయ గణనలో తప్పకుండా నమోదు చేసుకోవాలని మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా నగర పౌరులకు కమిషనర్ తెలియజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వీయ గణనకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంపొందించుటకు 2026 ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు 15 రోజులపాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా గ్రామాలు, వార్డులు, కాలనీలు, జాతీయ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రజా ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయన్నారు.
స్వయం సహాయక సంఘాలు (SHGs), మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థులు, వాలంటీర్లు భాగస్వామ్యంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామన్నారు.
ర్యాలీలు, సమావేశాలు, వీధి నాటకాలు, పోస్టర్లు, పాంప్లెట్లు ద్వారా ప్రచారం చేయబడుతుందని, మీడియా, సోషల్ మీడియా, పలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేపడుతున్నామన్నారు.
ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా https://se.census.gov.in వెబ్‌సైట్ నందు నమోదు చేయడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడగలదని, స్వీయ గణన ప్రక్రియలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని సూచించారు.
అలాగే, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అన్ని విభాగాల అధికారులు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జనగణన కార్యక్రమం దేశ ప్రణాళికా రూపకల్పనకు కీలకమైనదని, ప్రజలు పూర్తి సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కోరారు.
పౌర సంబంధాల అధికారి
జివిఎంసి

Comments
Post a Comment