Skip to main content

మావిగన్‌ నుంచి డైవర్షన్‌ కోసం దిగజారిన అచ్చెన్నాయుడు అందుకే గతి తప్పి కారుకూతలు :మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైర్‌

 


విశాఖపట్నంలోని క్యాంప్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.

మీ స్వార్థం కోసం వైయస్సార్‌ పేరు లాగొద్దు

ఆరోజు ఘటనలకు నేనే ప్రత్యక్ష సాక్షిని

అప్పుడు జగన్‌ విదేశాల్లో ఉన్నారనేది అబద్ధం 

రాజకీయాల కోసం నేను మీలా దిగజారను 

:బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ


అచ్చెనాయుడివి పనికి మాలిన మాటలు

రాజకీయాల కోసం ఇంతలా దిగజారాలా?

చంద్రబాబుకు ఈ మాటలు సిగ్గనిపించలేదా?

అచ్చెన్నాయుడు నీచపు వ్యాఖ్యలను ఖండిస్తున్నా

అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణలు చెప్పాలి

:ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ డిమాండ్‌


విశాఖపట్నం:

ఆచరణకు సాధ్యం కాని అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా జగన్‌గారు సూచించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరుతో కూడిన ‘మావిగన్‌’పై సమాధానం చెప్పలేని టీడీపీ, దిగజారి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆ దిశలోనే గతి తప్పిన మంత్రి అచ్చెన్నాయుడు మహానేత వైయస్సార్‌ మరణం, వైయస్‌ జగన్‌పై కారుకూతలు కూశారని ఆయన ఫైర్‌ అయ్యారు. ఆరోజు ఘటనలకు తానే ప్రత్యక్షసాక్షి అన్న బొత్స, అప్పుడు జగన్‌గారు విదేశాల్లో ఉన్నారనేది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం వైయస్సార్‌ పేరు లాగొద్దని తేల్చి చెప్పారు.

మహానేత వైయస్సార్‌ మరణించిన రోజున ఏదేదో జరిగిందంటూ అచ్చెన్న దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, తానలా దిగజారబోనని, అందుకే అచ్చెన్నాయుడి ప్రతి మాటను ఖండిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ ఇంకేమన్నారంటే..:


పనికి మాలిన అచ్చెన్నాయుడు:

జగన్‌గారు సూచించిన మావిగన్‌పై సమాధానం చెప్పలేక, డైవర్షన్‌ కోసం మంత్రి అచ్చెన్నాయుడు సహనం కోల్పోయి, అహంభావంతో మాట్లాడారు. అచ్చెన్నాయుడు తన రాజకీయ అవసరాల కోసం గతంలో మాట్లాడిన మాటలు మర్చిపోయారా? పార్టీ లేదు. బొక్కా లేదూ అన్న మాటలు మర్చిపోయారా? రాజకీయాల్లో అందరూ మీ (అచ్చెన్నాయుడు)లాగే ఉంటారనుకున్నారా? స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్ర ప్రజాప్రస్థానం ప్రారంభించి ఇవాళ్టికి (9వ తేదీ) 23 ఏళ్లు. ఈ రాష్ట్రంలో అలాంటి నేతల్ని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. రాష్ట్రంలో ప్రతీ ఊరులోనూ ప్రజలు ఆరాధించి, తమ నాయకుడిగా భావించిన మహానేత ఆయన. వైయస్సార్‌ పాదయాత్రను అందరూ గుర్తు చేసుకుంటున్న రోజున అచ్చెన్నాయుడు పనికి మాలిన వ్యాఖ్యలు చేశారు.

వైయస్సార్‌ మరణం వెనుక జగన్‌గారు ఉన్నారని నేను తనకు చెప్పినట్లు అచ్చెన్నాయుడు దిగజారుడు మాటలు మాట్లాడారు. రెండు పేపర్లు, మూడు ఛానళ్లు మీ చేతిలో ఉన్నాయని ఇష్టారాజ్యంగా అహంకారపు కూతలు కూస్తారా? కనీసం ఒక మనిషిగా కూడా మీకు ఏ విలువలు లేవా?.


ఉనికి కోసం అచ్చెన్నాయుడు దిగజారుడు వ్యాఖ్యలు:

మంత్రిగా బాధ్యతలు మర్చిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా, వాటి నిరోధానికి ఏ చర్యలు తీసుకోలేక చేష్టలుడిగి చూస్తున్న అచ్చెన్నాయుడు, తన ఉనికి కాపాడుకోవడం కోసం ఈ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్‌ మరణం రోజు జగన్‌గారు విదేశాల్లో ఉన్నారని ఇష్టారాజ్యంగా ఆధారాల్లేకుండా అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ రోజున పావురాలగుట్టకు వెళ్లిన నేనే అప్పటి ఘటనలకు ప్రత్యక్ష సాక్షిని. వైయస్సార్‌ హెలికాఫ్టర్‌ అన్వేషణ కోసం కేంద్రంతో మాట్లాడుతూ, ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలుసుకుని, కర్నూలు పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌కు ఆయన భౌతిక కాయం తరలించి నేను హైదరాబాద్‌ క్యాంప్‌ ఆఫీసుకు వచ్చాను. అప్పుడు జగన్‌ మాతోనే ఉన్నారు. నా వెనుకే వైయస్సార్‌ పార్థివదేహానికి పోస్టుమార్టం చేసి తీసుకొచ్చారు.

(అంటూ అప్పటి ఘటనను తల్చుకున్న బొత్స సత్యనారాయణ ఆవేదన ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు)


స్వార్థ రాజకీయాల కోసం మీ మాదిరిగా దిగజారలేం:

నేను రాజకీయాల కోసం బతకడం లేదు. అందుకే రాజకీయాల కోసం దిగజారను. మీ మాదిరిగా దిగజారుడు రాజకీయాలు కూడా చేయను. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు నా గుండెల్లో ఉన్నాయి. మీ పార్టీ సంగతులు కానీ, మీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ ఎన్నో ఉన్నాయి.

అచ్చెన్నాయుడు నీచ రాజకీయాల కోసం, పదవుల కోసం ఇంతలా దిగజారాడు. దమ్ముంటే మీకిచ్చిన పదవితో ప్రజలకు న్యాయం చేసే రాజకీయాలు చేయండి. అంతేకానీ ఇలా నైతికంగా దిగజారి కారుకూతలు కూయొద్దు. పదవుల కోసం లేనిపోని పిచ్చిమాటలు మాట్లాడొద్దు. నీ స్వార్థ రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడుకో. అమరావతి ఇష్టమైతే సమర్ధించుకో. అమరావతిని రేణుకాచౌదరి ‘కమ్మరావతి’ అన్నట్లుగా మీరు కూడా ఏదో ఒకటి మాట్లాడండి. అంతేకానీ, ఇవేం దిక్కుమాలిన మాటలు?.


చంద్రబాబూ ఇదేనా మీ పార్టీ సంస్కారం?:

చంద్రబాబు ఇదేనా మీ పార్టీ, మీ నేతల సంస్కారం? మీ రాజకీయాల్లో సభ్యత, సంస్కారం లేవు. మీ స్వార్థం కోసం ఎవరిపై అయినా ఎంతైనా మాట్లాడతారు. మీ అనుకూల మీడియాలో ఇష్టానుసారం రాయిస్తారు. మాకు రాజకీయాలు తెలియవా? మేమూ మీ మాదిరిగా మాట్లాడలేమా? కానీ, మాకు సభ్యత, సంస్కారం ఉంది. కాబట్టే, మీలా గతి తప్పి పిచ్చిగా మాట్లాడడం లేదు. 


మావిగన్‌పై ఎందుకంత ఉలికిపాటు?:

అమరావతిలో నిర్మాణాల పేరిట మీరు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారు. వాటన్నింటిని ప్రశ్నిస్తూ, ఆచరణ సాధ్యం కాని అమరావతిలో అన్ని లక్షల కోట్ల ఖర్చుకు బదులుగా, ఆ ఖర్చులో కేవలం పదో వంతు వ్యయంతో, డే వన్‌ నుంచే అందుబాటులోకి వచ్చే మావిగన్‌ ‘మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు’తో కూడిన రాజ«ధాని కారిడాన్‌ను జగన్‌గారు సూచించారు. ఆ పేరు వింటేనే మీరెందుకు ఉలికి పడుతున్నారు? దాన్నుంచి డైవర్షన్‌ కోసం ఎందుకీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు?. 

మావిగన్‌ ప్రతిపాదనను పక్కదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి. మావిగన్‌ నుంచి డైవర్షన్, వ్యక్తిగతంగా చౌకబౌరు విమర్శలు చేసి ఎదుటి వారిని అవమానపర్చడం తప్ప ఇందులో ఏమీ లేదు. మొన్న మా పార్టీ నేతలు, మహిళలపై మీ ఎల్లో మీడియాలో ఇష్టారాజ్యంగా కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు ఇంకా దిగజారి వైయస్సార్‌గారి మరణాన్ని ప్రస్తావిస్తూ, మధ్యలో మమ్మల్ని సాక్షులుగా పెట్టి, పిచ్చి వ్యాఖ్యలతో నీచ రాజకీయం మొదలుపెట్టారు. అందుకు మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇంకా ఆనాడు జగన్‌గారు సంతకాలు సేకరించారనేది పచ్చి అబద్ధమని బొత్స సత్యనారాయణ వివరించారు.

ఈ సమావేశంలో అరుకు పార్లమెంట్ సభ్యురాలు చెట్టి తనుజ రాణి, శాసనమండలి సభ్యులు కుంభ రవిబాబు, సమన్వయకర్త మొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు

Comments