సంక్షోభాలనుంచి పరిష్కరాలు అణ్వేషించాలి - అవకాశాలుగా మలచుకుంటూ రాణించాలి -ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు
ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఏప్రియల్ 22: సంక్షోభాల నుంచి పరిష్కారాలను అన్వేషించాలని, వాటినే అవకాశాలుగా మలచుకుంటూ యువతరం ముందుకు సాగాలని ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కె.హరి బాబు అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా శతాబ్ధి వారోత్సవాలలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల, మహిళా ఇంజనీరింగ్ కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న కళాశాల స్థాయి వేడుకలను ఆయన ముఖ్య అతిధిగా హాజరై బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఈరోజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నషాముక్త్ క్యాంపస్‌లుగా విశ్వవిద్యాలయాలు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా యువతలో చైతన్యం నింపాలని సూచించారు. దేశ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తయారు చేయడంతో పాటు ప్రపంచ అవసరాలకు అనుగుణంగా యువతను సన్నద్ధం చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయం నిరంత ప్రగతి సాధించడం, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడం ఎంతో ప్రధానమన్నారు. అవకాశాలు అపారమని, వాటిని అందిపుచ్చకునే దిశగా మనం అడుగులు వేయాలన్నారు. ముఖ్యంగా భారత్‌కు క్రూడ్ ఆయిల్ దిగుమతులు, రక్షణ రంగ ఆయుధాలు, వంటనూనెలు అధికంగా దిగుమతి అవుతున్నాయని, వీటిని తగ్గించుకోవడం ద్వారా దేశ సంపద విదేశాలకు వెళ్లకుండా నియంత్రించడం సాధ్యపడుతుందన్నారు. ఏకాగ్రత, క్రమశిక్షణ, స్థిరమైన కృషి కలిగి ఉండే నిర్ధిష్ట లక్ష్యాలను సాధించడం వీలవుతుందన్నారు. పుస్తకాలను దాటి అభ్యసనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. నూతన ఆలోచనలను సృజించడం ప్రధానమన్నారు. ఆచార్యులు విద్యార్థులకు మార్గదర్శకం చేయడం, యువ మస్తిష్కాలకు తగిన చోదకశక్తిగా నిలవడం అవసరమన్నారు. అవకాశాలతో సమానంగా సవాళ్లు ఉన్నాయని, పరమిత వనరులతో మనం ఏమి సాధించగలము అని ఆలోచన చేయాలన్నారు.
తాను రాజకీయ ఓనమాలను ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నేర్చుకున్నానన్నారు. నేడు తాను ఉన్న స్థితికి చేరుకోవడానికి ఏయూ కారణమన్నారు. వందేళ్ల ఏయూ ప్రయాణం పరిశీలిస్తే జ్ఞానము, నైతిక విలువలు, సేవ అనే మూడు సూత్రాలపై సాగిందని స్పష్టమవుతుందన్నారు. కళాశాల శతాబ్ధి ప్రత్యేక సంచికను వేదికపై గవర్నర్ విడుదల చేశారు. అనంతరం ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రిన్సిపాల్స్‌గా, ఆచార్యలుగా సేవలందించి పదవీ విరమణ చేసిన వారిని, పలువురు పూర్వ విద్యార్థులను వేదికపై సత్కరించి, జ్ఞాపికలను బహూకరించారు.
ఉన్నత విద్య మండలి చైర్మన్ ఆచార్య కె.మధు మూర్తి మాట్లాడుతూ విలువలతో ఎదగడం, సమాజానికి ఉపయుక్తగా నిలవడం ఏయూను చూస్తే అర్ధమవుతుందన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం మానవ వనరులతో తయారు చేయడంతో పాటు, నాయకత్వాన్ని సైతం పెంపొందించిందన్నారు. అనంత అవకాశాలను అందించే శక్తి ఏయూకు ఉందన్నారు. తాము చదవుకునే రోజుల్లో ఓపెన్ హౌస్ ఉండేదని, ప్రతీ విభాగంలో ఉన్న వసతులు ఇతర విభాగాల విద్యార్థులు తెలుసుకునేవారన్నారు. డిజిటల్ టెక్నాలజీ, విద్య రంగాలలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయాలలో బోధన వసతులను బలోపేతం చేస్తామని, త్వరలో నియామక ప్రక్రియ జరుపుతామన్నారు.నూతన అవకాశాలు, సంస్థలు రాష్ట్రంలో వస్తున్నాయని దీనికి అవసరమైన నూతన మానవ వనరులు, నైపుణ్యాలుకలిగిన యువత అవసరమన్నారు. కాలానుగుణంగా కరికులంలో మార్పు చేయడం ప్రధానమన్నారు.
ఎన్‌టియూ ప్రెసిడెంట్స్ చైర్ ప్రొఫెసర్ ఆచార్య ఉపద్రష్ట రామమూర్తి మాట్లాడుతూ తాను ఏయూలో చదువుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్ర, దేశ ఆర్ధిక ప్రగతికి విశ్వవిద్యాలయాలు చోదక శక్తిగా నిలుస్తాయన్నారు. విశ్వవిద్యాలయాల మధ్య పోటీతత్వం పెరిగిందని, నూతన జ్ఞానాన్ని సృష్టించడం ఎంతో అవసరమన్నారు. ఏయూ ఘనమైన వారతస్వాన్ని కలిగి ఉందని, దీనిని మరింత పెంచేదిశగా పనిచేయాలన్నారు. విశ్వవిద్యాలయాలు స్వయం సంవృద్ధి సాధించాలని, దీనికి పూర్వవిద్యార్థులు, ప్రభుత్వం సహకారం ఎంతో అవసరమన్నారు. బాధ్యతాయుత పౌరులను పాఠశాలలు తయారు చేస్తాయని, దేశానికి అవసరమైన నాయకత్వాన్ని విశ్వవిద్యాలయాలు అందిస్తాయన్నారు.
ఏయూ వీసీ ఆచార్ జి.పి రాజశేఖర్ ప్రసంగాన్ని రెక్టార్ ఆచార్య పి.కింగ్ చదివి వినిపించారు. విద్యార్థులే భవిష్యత్ ఆవిష్కర్తలన్నారు. సమాజానికి అర్ధవంతమైన సహకారం అందించాలన్నారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులను సిద్దం చేస్తున్న ఆచార్యుల కృషి అభిలషనీయమన్నారు. పూర్వ విద్యార్థుల ప్రగతి విశ్వవిద్యాలయానికి స్ఫూర్తిని, ఖ్యాతిని అందిస్తాయన్నారు. ఆవిష్కరణలు, సమ్మిళితత్వంతో, దేశ నిర్మాణంలో మన నిబద్ధతను చాటాలన్నారు.
ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.శశి కళాశాల స్థాపన నుంచి సాధించిన ప్రగతి, విద్యార్థులను మలచే దిశగా జరుగుతున్న ప్రయత్నాలను వివరించారు. కళాశాలలో అందిస్తున్న కోర్సుల వివరాలు తెలియజేశారు. పూర్వ విద్యార్థుల విజయాలు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. తాము ఎంపిక చేసుకున్న రంగంలో వారు అత్యుత్తమ స్థాయికి ఎదిగారన్నారు. సమాజానికి మరింత ఉపయుక్తంగా నిలచే విధంగా తమ జ్ఞానంతో సమాజాన్ని నడిపించే విధంగా యువతను తీర్చదిద్దడానికి నిబద్దతతో సేవలు అందిస్తామన్నారు. మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్.పద్మశీ కళాశాల ప్రగతి, వికాసాన్ని తెలియజేశారు. 2010లో ప్రారంభమైన మహిళా ఇంజనీరింగ్ కళాశాల మహిళా శక్తికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు.
విశ్వవిద్యాలయం తరపున అతిధులను సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. కార్యక్రమంలో ఆచార్య జి.వి.ఆర్ శ్రీనివాస రావు, ఆచార్య ఎన్.చిట్టిబాబు, ఆచార్య డి.లలిత భాస్కరిం, ఆచార్య బి.ప్రజ్ఞ, ఆచార్య పి.స్వప్న తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
K.V.SHARMA EDITOR







Comments
Post a Comment