ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఏప్రియల్ 5:దేశ అభ్యున్నతికి బాబు జగ్జీవన్‌రామ్ చేసిన కృషి నిరుపమానమని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. ఆదివారం ఉదయం బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఏయూలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సుదీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా సేవలు అందించి, తాను చేపట్టిన ప్రతీ శాఖకు వన్నె తెచ్చిన ఆయన సేవలను గుర్తుచేసుకోవాలన్నారు. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ద సమయంలో ఆయన రక్షణ మంత్రిగా పనిచేసారని గుర్తుచేశారు. రాజకీయ వేత్తగానే కాకుండా సామాజిక సేవలో కూడా జగ్జీవన్ రామ్ ముందుండేవారన్నారు. అటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు.సిడిసి డీన్ ఆచార్య టి.వెంకట కృష్ణ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్ చేసిన సేవలను కొనియాడారు. భారత ఉపప్రధానిగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశ అభివృద్ధికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేసారన్నారు. దేశం ప్రధమం అన్న విధంగా ఆయన తన విధులను నిర్వహించారని గుర్తుచేశారు.కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్, డీన్‌లు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment