పేదలకు భరోసా కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం: మాజి ఎంపీ చింతా అనురాధ.... కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా పేదలపై నిర్లక్ష్యం... ప్రచారానికి వందల కోట్లు… పేదల సంక్షేమానికి మాత్రం శూన్యం....
డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 19 మండలాలు, 3 పురపాలక సంఘాల్లో కలిపి గత రెండున్నర సంవత్సరాలుగా సుమారు 25 వేల మంది అర్హులైన పేదలు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని చింతా అనురాధ తెలిపారు. వీరిలో దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎటువంటి ఆర్థిక ఆసరా లేని నిరుపేదలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలో సుమారు 35 వేల మంది దివ్యాంగులకు పింఛన్ సౌకర్యం కల్పించగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య పరీక్షల పేరుతో వారిలో దాదాపు 10 వేల మందిని అనర్హులుగా ప్రకటించి, వారి పింఛన్లు నిర్దాక్షిణ్యంగా నిలిపివేసిందని అనురాధ గారు ఆరోపించారు. ఈ చర్య వల్ల ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి 20 నుంచి 30 మంది నిరుపేదలు తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదని వినతిపత్రాలు ఇస్తున్నారని చింతా అనురాధ గారు తెలిపారు. అయితే, అధికారుల సమాధానం మాత్రం “కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు” అనే నిర్లక్ష్యపూరిత ధోరణిలోనే ఉంటోందని విమర్శించారు. దీంతో బాధితులు ఆవేదనతో, నిరాశతో వెనుదిరుగుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి నెల ఏదో ఒక జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, పేదల సంక్షేమం కంటే ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యం ఇస్తున్నారని చింతా అనురాధ మండిపడ్డారు. ఈ కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన నిరుపేదలకు తక్షణమే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చింతా అనురాధ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, పేదల జీవితాలతో ఆడుకోవడం మానుకోవాలని ఆమె హెచ్చరించారు

Comments
Post a Comment