తప్పుడు, తప్పుదారి పట్టించే ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు, వాకర్లకు విజ్ఞప్తి. * పార్కుల్లో నడకకు జీవీఎంసీ ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదు. * స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం మరియు శివాజీ పార్క్‌లలో మాత్రమే నిర్వహణ కొరకు స్వల్ప వినియోగ రుసుములు.
విశాఖపట్నం, ఏప్రిల్ 22:పార్కుల్లో నడకపై పన్ను విధించారన్న ప్రచారం పూర్తిగా అసత్యమని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ స్పష్టం చేసింది. నగరంలో ప్రజల ఆరోగ్యం, వినోదాన్ని దృష్టిలో ఉంచుకుని గత రెండేళ్లలో సుమారు రూ.35 కోట్ల వ్యయంతో సుమారు 45 పార్కులను అభివృద్ధి చేసినట్లు తెలియజేసింది. అలాగే మరో రూ.30 కోట్ల వ్యయంతో పలు క్రీడా మైదానాలు, స్టేడియాలను ఆధునీకరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది.
ప్రస్తుతం నగరంలోని ఏ పార్కులోనూ వాకర్ల నుండి ఎలాంటి రుసుములు లేదా పన్నులు వసూలు చేయడం లేదని, కేవలం శివాజీ పార్క్‌లో మాత్రమే గత 25 సంవత్సరాలుగా ఎలాంటి పెంపు లేకుండా రూ.75/- నెలకు స్వల్ప రుసుము వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన సుమారు 180 పార్కులను జీవీఎంసీ ప్రత్యక్షంగా లేదా నివాసితుల సంక్షేమ సంఘాలతో కలిసి నిర్వహిస్తోందని, ఎక్కడా వాకింగ్ ఫీజు విధించలేదని స్పష్టం చేశారు.
ఇటీవల స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంను రూ.18 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసి, ఎటువంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా జీవీఎంసీ స్వయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాకర్లకు తాగునీటి సదుపాయాలతో కూడిన శుభ్రమైన నడక ట్రాక్ ఏర్పాటు చేయబడినట్లు పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చుల నిమిత్తం రోజుకు రూ.2 (నెలకు రూ.60 / సంవత్సరానికి రూ.720) మాత్రమే స్వల్ప వినియోగ రుసుము వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ స్వల్ప రుసుము చెల్లిస్తూ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం మరియు శివాజీ పార్క్‌లలో పెద్ద సంఖ్యలో వాకర్లు సౌకర్యాలను వినియోగిస్తున్నారని, ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కమిషనర్ తెలిపారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, అలాంటి అసత్యాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
గాజువాకలో రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంను రూ.10 కోట్ల చొప్పున అభివృద్ధి చేసి, వాటి నిర్వహణకు ప్రతి నెలా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
శివాజీ పార్క్‌లో గత 25 సంవత్సరాలుగా నెలకు రూ.75 (రెండు నెలలకు రూ.150) రుసుము వసూలు చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.
అలాగే విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో పోర్ట్ అధికారులు నెలకు రూ.100 (సంవత్సరానికి రూ.1200) వసూలు చేస్తున్నారని, దీనితో పోలిస్తే జీవీఎంసీ కొన్ని సౌకర్యాలలో మాత్రమే రోజుకు రూ.2 అనే స్వల్ప రుసుము మాత్రమే వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
“పార్కుల్లో నడకపై పన్ను” అనే తప్పుడు ప్రచారాలను ప్రజలు తిరస్కరించి, నగర అభివృద్ధి మరియు నిర్వహణలో సహకరించాలని కమిషనర్ ప్రజలకు, వాకర్లకు విజ్ఞప్తి చేశారు.
పౌర సంబంధాల అధికారిజీవీఎంసీ
K.V.SHARMA. EDITOR

Comments
Post a Comment