Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. ​సింహగిరిపై 'అప్పన్న' అల్లరి.. భక్తుల మధ్య 'ఉంగరాల వేట' వినోదం! సింహగిరిపై వైభవంగా ‘అంగుళీయక అన్వేషణ’ ఉత్సవం “అప్పన్న ఉంగరం పోయింది”… భక్తుల్లో ఉత్కంఠ రేపిన వినోదోత్సవం బందీల విచారణతో అలరించిన సంప్రదాయ ఉత్సవం – చివరకు పట్టు పీతాంబరాల్లో లభించిన ఉంగరం. ​ఈవో జె. వెంకట్రావు ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన ‘అంగుళీయక అన్వేషణ’

సింహాచలం, ఏప్రిల్ 3, 2026:ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహగిరిపై వెలసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా, నేడు అత్యంత ఆసక్తికరమైన ‘అంగుళీయక అన్వేషణ’ (ఉంగరాల వేట) ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తికి వినోదాన్ని జోడించి, స్వామివారి లీలలను కళ్లకు కట్టేలా నిర్వహించిన ఈ ఘట్టం భక్తజనులను మంత్రముగ్ధులను చేసింది.

 ​కళ్యాణ సమయంలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బంగారు ఉంగరం కనిపించకుండా పోయిందనే నెపంతో ఈ సరదా ఉత్సవాన్ని నిర్వహించడం ఇక్కడి అనాదిగా వస్తున్న ఆచారం.

​అమ్మవారి ఆగ్రహంతో ఉంగరం లేకుండా ఆలయంలోకి ప్రవేశం లేదని అమ్మవారు తలుపులు మూసివేయడంతో, స్వామివారు మహారాజా అలంకారంలో తన పరివారంతో కలిసి గ్రామ వీధుల్లో అన్వేషణకు బయలుదేరారు.

ఈ అన్వేషణలో భాగంగా స్వయంగా ఆలయ ఈవో జె. వెంకట్రావు దంపతులతో పాటు, సహాయ ఈఓలు, పోలీసులు, పాత్రికేయులు మరియు పలువురు భక్తులను స్వామివారి పరివారం బందీలుగా పట్టుకోవడంవారిని ఉత్కంఠభరిత విచారణచేయడం విశేషం. ఉంగరం ఎక్కడుందో చెప్పాలంటూ వారిని విచారించిన తీరు భక్తులకు కనువిందు చేసింది.​ 

ఎక్కడ వెతికినా దొరకని ఉంగరం, చివరకు స్వామివారి పట్టు పీతాంబరాల్లోనే లభించడంతో ఉత్కంఠ వీడి భక్తులందరూ హర్షధ్వానాలు చేశారు.

ఈ ఉత్సవమంతటినీ దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె. వెంకట్రావు  అత్యంత ప్రణాళికాబద్ధంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా, సంప్రదాయ ఉత్సవంలో స్వయంగా బందీగా పాల్గొని భక్తులలో భక్తి భావాన్ని, ఉత్సాహాన్ని నింపారు. ఆయన సారథ్యంలో ఆలయ సిబ్బంది మరియు అర్చక బృందం ఈ వినోదోత్సవాన్ని రసవత్తరంగా తీర్చిదిద్దారు.

ఇది కేవలం ఉత్సవం మాత్రమే కాదు, భక్తజనులకు స్వామి వారి లీలలను గుర్తుచేసే అద్భుత ఘట్టం. లోక రక్షకుడు తన భక్తులతో కలిసి ఆడే ఈ లీలలు అందరికీ పునీత అనుభూతిని ఇస్తాయి.”

స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్ గారి పర్యవేక్షణలో, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఏఈఓలు తిరుమలేశ్వరరావు, వి. రమణమూర్తి, పర్యవేక్షణ అధికారి బి. సత్య శ్రీనివాస్, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు

అనంతరం స్వామి, అమ్మవార్ల మధ్య జరిగిన సంవాద సేవతో అన్వేషణ ఉత్సవం మంగళప్రదంగా ముగిసింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు సింహగిరిపై సాగిన ఈ అద్భుత దృశ్యాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగితేలారు.ఈ సందర్భంగా ఈఓ వెంకట్రావు దంపతులు, సహాయ ఈఓలు, అధికారులు, దాతలు, నూతన వధూవరులు, పాత్రికేయులు, పోలీసు సిబ్బందిని బందీలుగా చేసిన  తీరు భక్తులకు కనువిందు – పునీత అనుభూతి కలిగించింది.

భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వినూత్న అన్వేషణ ఉత్సవాన్ని దర్శించుకుని భక్తి, ఆనందాలతో పునీతులయ్యారు. సింహగిరిపై నిర్వహించిన ఈ వినోదోత్సవం అందరినీ ఆనందంపజేసింది.

Comments