రావులపాలెం, విశాఖ సందేసం :చాలీచాలని జీతం, ఆర్థిక ఇబ్బందులతో డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది. అమలాపురంకు చెందిన బండారు ప్రశాంత్ (30) రావులపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం కొత్తపేట మండలం వాడపాలెం సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసాడు. దీనికి ముందుగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు. వీడియో చూసి ఘటనా స్థలానికి చేరుకున్న, తోటి సిబ్బంది అతన్ని రావులపాలెంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తన సమస్యపై దృష్టి సారించి న్యాయం చేయాలని అతను సెల్ఫీ వీడియోలో కోరాడు.

విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయాలని, చాలీచాలని జీతంతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ తన చావుతోనైన మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలీచాలని జీతంతో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఈ సందర్భంగా విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘ నాయకులు కోరారు. ప్రశాంత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకున్న తోటి సిబ్బంది. యూనియన్ నాయకులు అతని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని, ఉద్యోగులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు.

Comments
Post a Comment