Skip to main content

జిల్లా గ్రంథాలయ సంస్థ కు భవన వసతి కల్పించండి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్


విశాఖపట్నంలో వేలాది మంది విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు మరియు పాఠకులకు సేవలందిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ కు, జిల్లా కేంద్ర గ్రంథాలయానికి తగిన భవన వసతి కల్పించాలని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ కోరారు.ఈ మేరకు బుధవారం వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్,మెట్రోపాలిటన్ కమీషనర్ ఎన్ తేజ్ భరత్ లను మర్యాదపూర్వకంగా సతీష్ కుమార్ కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా కేంద్ర గ్రంథాలయం మరియు సంస్థ కార్యాలయం ప్రైవేటు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య నడుస్తున్నాయని, దీనివల్ల ఎదురవుతున్న ప్రధాన సమస్యలను వివరించారు.తగినంత స్థలం లేకపోవడం వల్ల విలువైన పుస్తకాలు భద్రపరచడానికి, పాఠకులు కూర్చుని చదువుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.విశాఖ నగరం ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రభుత్వ నిబంధనల మేరకు వీఎంఆర్డీఏ పరిధిలో సుమారు 5000 చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనాన్ని కేటాయిస్తే ప్రభుత్వ జీవో (జిఓ నెంబర్ 37) ప్రకారం నిర్ణీత అద్దె చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.నగరంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, చదువుకోవడానికి అనువైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు వీఎంఆర్డీఏ  సానుకూలంగా స్పందించాలని కోరారు. ఆధునిక గ్రంథాలయ భవనం అందుబాటులోకి వస్తే విద్యార్థుల  విద్యా నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని సతీష్ కుమార్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments