గ్లోబల్ ఎఐ సిటీగా విశాఖ… గూగుల్ మెగా ప్రాజెక్టుతో చారిత్రాత్మక మైలురాయి* *▪️ చంద్రబాబు విజన్–లోకేష్ కృషి ఫలితం… ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి నూతన యుగానికి నాంది* *-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస
విశాఖపట్నం, ఏప్రిల్ 09:* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగంలో చారిత్రాత్మక ముందడుగు వేయబోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తెలిపారు. ఈ నెల 28న విశాఖపట్నంలో ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ డేటా సెంటర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
సుమారు 15 బిలియన్ డాలర్లు (రూ.1.35 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో 601 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని, 2028 జూలై నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి అపూర్వమైన పెట్టుబడులు రావడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఇప్పటివరకు ‘సిటీ ఆఫ్ డెస్టినీ’గా పేరుగాంచిన విశాఖపట్నం ఇకపై గ్లోబల్ స్థాయిలో ఎఐ సిటీగా అవతరించబోతోందని తెలిపారు. దేశంలోనే తొలి 1 గిగావాట్ ఎఐ హబ్‌గా విశాఖ రూపుదిద్దుకోవడం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశను నిర్దేశిస్తుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, సాంకేతిక అభివృద్ధిపై ఉన్న స్పష్టమైన విజన్ వల్లే గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి ఆకర్షితమవుతున్నాయని పల్లా గారు కొనియాడారు. అలాగే మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నిరంతర కృషి, పట్టుదల, వేగవంతమైన కార్యాచరణ వల్లే ఈ భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌కు సాధ్యమైందని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం టెక్నాలజీ హబ్‌గా మారి, మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అనుభవం లభించి, ప్రపంచ స్థాయి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక విధానాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణంతో గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నదని పల్లా గారు తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ధి దిశగా పయనిస్తూ, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తాయని అన్నారు.
ఇది కేవలం ఒక డేటా సెంటర్ మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తుకు, రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకమైన మహత్తర అవకాశం అని పల్లా గారు పేర్కొన్నారు. ఈ పెట్టుబడులను అడ్డుకునేందుకు ఎన్నో ప్రతికూల శక్తులు ప్రయత్నించినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాటన్నింటినీ అధిగమించి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
గూగుల్ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధి పథంలో ఒక కీలక మైలురాయిగా నిలిచి, “విజన్ ఆంధ్రప్రదేశ్”కు మరింత బలం చేకూర్చే చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తాయని పల్లా శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు.

Comments
Post a Comment