Skip to main content

జూన్ 1 తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు* *▪️ దశాబ్దాల పోరాటాలు–తరాల ఆకాంక్షలకు ఫలితం... 30 ఏళ్ల టీడీపీ పోరాటంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారం* *▪️ ఉత్తరాంధ్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా రైల్వే జోన్... విజయోత్సవంలా జరుపుకోవాలి* *-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు*

 

                   K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం, మే 31:* జూన్ 1వ తేదీ తెలుగు ప్రజల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, తరాల పోరాటం, లక్షలాది మంది ఆకాంక్షలకు ప్రతిరూపంగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భవిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ విజయం ఒక్క నాయకుడిదో కాదని... ఉత్తరాంధ్ర నేలపై జన్మించిన ప్రతి తెలుగు బిడ్డదని అన్నారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... రైల్వే జోన్ కోసం జరిగిన ఉద్యమాలను, పోరాటాలను తలుచుకుంటే గర్వంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరిగిన అన్యాయాలపై విద్యార్థులు, యువకులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడిన ఉద్యమ ఫలితమే నేడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని చెప్పారు.

 *ఒక తరం పోరాటం... మరో తరం సాధించిన విజయం* 

రైల్వే జోన్ కోసం ఎంతో మంది నాయకులు తమ జీవితాలను అంకితం చేశారని పల్లా గుర్తు చేశారు. కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు ప్రారంభించిన ఉద్యమం నేడు ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి హయాంలో ఫలితాన్నివ్వడం విశేషమన్నారు. ఎం.ఎస్. మూర్తి గారు చేసిన పోరాటానికి నేడు ఆయన మనవడు విశాఖ ఎంపీ శ్రీభరత్ గారు ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో న్యాయం జరిగిందన్నారు. అలాగే ప్రతిమశెట్టి అప్పలనరసింహం గారు, అనేక మంది ఉద్యమకారులు, ప్రజా ప్రతినిధులు చేసిన కృషి కూడా ఈ విజయానికి పునాది అని పేర్కొన్నారు. ఒక తరం ఉద్యమం చేస్తే... మరో తరం దాన్ని సాకారం చేసుకున్న అరుదైన చారిత్రక ఘట్టం ఇది అని పల్లా వ్యాఖ్యానించారు.

 *30 ఏళ్ల టీడీపీ పోరాటానికి విజయ ఫలితం* 

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు తెలుగుదేశం పార్టీ మూడు దశాబ్దాలుగా సాగించిన నిరంతర పోరాటానికి దక్కిన విజయమని పేర్కొన్నారు. రైల్వే జోన్ కోసం టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌లోనూ, ప్రజాక్షేత్రంలోనూ నిరంతరం గళమెత్తారని గుర్తు చేశారు. రేపటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించడం తెలుగు ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవమన్నారు.

 *చంద్రబాబు సంకల్పం... మోదీ సహకారంతో సాకారం* 

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీని కార్యరూపంలోకి తీసుకురావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి పట్టుదల కీలక పాత్ర పోషించిందన్నారు. రైల్వే జోన్ అంశాన్ని ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ నిరంతర ఒత్తిడి తీసుకువచ్చారని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ గారి సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మద్దతు, కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు, ఎంపీ శ్రీభరత్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ తదితరుల కృషి కూడా ఈ విజయానికి కారణమైందన్నారు. ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా భవిష్యత్తులో బుల్లెట్ రైలు ప్రాజెక్టును తీసుకొస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఊతమిచ్చే అంశమని పేర్కొన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందించి, ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

 *వైసీపీ నిర్లక్ష్యంతో ఐదేళ్లు జాప్యం* 

2019లో జోన్ ప్రకటించిన తర్వాత కూడా గత వైసీపీ ప్రభుత్వం భూసేకరణ వంటి కీలక అంశాలను పూర్తిచేయడంలో విఫలమైందని పల్లా విమర్శించారు. కేవలం ప్రకటనలకే పరిమితమై ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి జోన్ ఆవిర్భావానికి మార్గం సుగమం చేసిందన్నారు.

 *ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిక్సూచి* 

ఇప్పటి వరకు రైల్వేకు సంబంధించిన చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం కూడా భువనేశ్వర్‌పై ఆధారపడాల్సి వచ్చేదని పల్లా గుర్తు చేశారు. ఉద్యోగాలు, నియామకాలు, అభివృద్ధి పనులు, రైల్వే ప్రాజెక్టుల కోసం ఉత్తరాంధ్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు విశాఖలోనే జోనల్ కార్యాలయం ఉండటంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు, కొత్త రైళ్లు, ట్రాక్ విస్తరణ, స్టేషన్ అభివృద్ధి వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుందని పేర్కొన్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు అవకాశాలు పెరగడంతో యువతకు ఉద్యోగావకాశాలు మరింత విస్తరించనున్నాయని తెలిపారు.

 *పోర్టులు, పరిశ్రమలకు బలమైన అండ* 

విశాఖపట్నం, గంగవరం పోర్టులు, ఉక్కు కర్మాగారం, పారిశ్రామిక కారిడార్లు, తయారీ రంగాలకు రైల్వే జోన్ ఎంతో ఉపయోగపడుతుందని పల్లా వివరించారు. సరుకు రవాణా వ్యయం తగ్గడంతో పరిశ్రమలకు పోటీ సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ఎగుమతులు, దిగుమతులు వేగవంతమవడంతో ఉత్తరాంధ్ర ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు. గాజువాక, అచ్యుతాపురం, నక్కపల్లి, విశాఖ పారిశ్రామిక ప్రాంతాలతో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమలకు రైల్వే జోన్ గొప్ప ఊతమివ్వబోతోందన్నారు. స్థానిక స్థాయిలో తీసుకునే నిర్ణయాలు పరిశ్రమల విస్తరణకు దోహదపడతాయని తెలిపారు.

 *ప్రతి తెలుగు వాడి విజయోత్సవం* 

దేశంలో 18వ రైల్వే జోన్‌గా, సుమారు 4 వేల కిలోమీటర్ల పరిధితో, ఆంధ్రప్రదేశ్‌లో 99 శాతం రైల్వే నెట్‌వర్క్‌ను కవర్ చేసే జోన్‌గా దక్షిణ కోస్తా రైల్వే అవతరించడం గర్వకారణమని పల్లా పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రైల్వే జోన్ కాదు... ఉత్తరాంధ్ర ఆత్మగౌరవానికి లభించిన గౌరవం. ప్రజల ఆకాంక్షలు, ఉద్యమాల విజయానికి ప్రతీక. అందుకే జూన్ 1ను ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి రైల్వే స్టేషన్ వద్ద సంబరంగా జరుపుకోవాలి. మిఠాయిలు పంచుకుని ఈ విజయాన్ని ప్రజల విజయంగా చాటాలి అని పిలుపునిచ్చారు.

ప్రజల సమస్యలపై నిజాయితీగా, నిరంతరం పోరాడితే ఫలితం తప్పక వస్తుందనే నమ్మకానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ సజీవ నిదర్శనమని, రేపటి రోజు తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే రోజని, మనందరి పోరాటాలకు లభించిన ప్రతిఫలమని, తెలుగు ప్రజలంతా దీనిని పండుగలా జరుపుకోవాలని పల్లా కోరారు.

Comments