Skip to main content

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావం తెలుగు జాతి దశాబ్దాల కల సాకారం* *▪️ తెలుగు ప్రజల పోరాట పటిమకు, నాయకత్వ సంకల్పానికి ప్రతీకగా రైల్వే జోన్.. జూన్ 1ను విజయోత్సవంలా జరుపుకోవాలి.* *-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు*


విశాఖపట్నం.విశాఖ సందేశం:మే 30:*
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటం తెలుగు ప్రజల దశాబ్దాల కల సాకారమైన చారిత్రాత్మక ఘట్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ విజయాన్ని ప్రతి తెలుగు వాడి విజయంగా భావిస్తున్నానని, రైల్వే జోన్ సాధన కోసం జరిగిన ఉద్యమాలు, పోరాటాల్లో భాగస్వామి కావడం పట్ల గర్వంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాష్ట్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన హామీల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఒకటని గుర్తుచేశారు. దశాబ్దాల పోరాటం, ప్రజల ఆకాంక్షలు, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి ఫలితంగానే నేడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భవించిందన్నారు.

 *తెలుగు ప్రజల ఆకాంక్షలకు న్యాయం* 

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కార్యకలాపాలు ప్రారంభించడం రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని పల్లా పేర్కొన్నారు. రైల్వే పరిపాలన, మౌలిక వసతుల అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, ఉద్యోగ అవకాశాల కల్పనలో ఈ జోన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

 *కూటమి ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం* 

దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం తెలుగు ప్రజల పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.

 *విజయోత్సవంలా జరుపుకోవాలి* 

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగు ప్రజల విజయ పర్వంగా భావించాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరారు.

ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణంలో, గ్రామంలో రైల్వే జోన్ సాధనకు గుర్తుగా సంబరాలు నిర్వహించాలని, సమీప రైల్వే స్టేషన్లు, రైల్వే బోర్డుల వద్ద మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని పంచుకోవాలని సూచించారు. ఇది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం కాదని... తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, సంకల్పానికి లభించిన విజయమని పేర్కొన్నారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావం రాష్ట్ర ప్రగతికి కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, ఈ విజయాన్ని ప్రజలందరూ తమ విజయంగా భావించి విజయోత్సవంలా జరుపుకోవాలని పల్లా శ్రీనివాసరావు కోరారు.

                            కె. వి. శర్మ, ఎడిటర్,

Comments