టీడీపీ సెంట్రల్ ఆఫీస్ లో ఈనెల 27,28 తేదీల్లో మహానాడు నిర్వహణ* *దేశం ఔరా అనేలా.....తెలుగుజాతి మురిసేలా...హైబ్రిడ్ విధానంలో మహానాడు* *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు*
తెలుగుదేశంపార్టీకి, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మహానాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుజాతి మొత్తం కదలివచ్చి మేముసైతం...తెలుగుదేశంకోసం అని నినదించే అరుదైన ఘట్టం మహానాడు కార్యక్రమం. యావత్ దేశమంతా ఔరా అనేలా హైబ్రిడ్ మహానాడుతో డిజిటల్ విప్లవానికి నాంది పలకబోతున్నాం. తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించిన నాటి నుండి మహానాడు కార్యక్రమాన్ని ప్రతియేటా నిర్వహించడం ఆనవాయితీ. తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావుగారి జయంతిని పురస్కరించుకుని అత్యంత వైభవంగా తెలుగుదేశం మహానాడు కార్యక్రమాలు 3రోజులు నిర్వహించడం, లక్షలాది మంది కార్యకర్తలందరూ ఒకే వేదికగా ఏర్పడి పార్టీ ప్రణాళికల్లో భాగస్వామ్యం కావడం ఈ కార్యక్రమం ఉద్దేశం. పార్టీతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీర్మానాలు చేయడం, చర్చించడం ఈ మహానాడు లక్ష్యం.
*దేశం కోసం - డిజిటల్ అడుగులు వేస్తున్న తెలుగుదేశం :*
పశ్చిమాసియా యుద్ధాల నేపథ్యంలో నెలకొన్ని కొన్ని విపత్కర పరిస్థితుల దృష్ట్యా దేశపౌరులు తమ ఖర్చులను తగ్గించుకోవాలని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారు ఇచ్చిన పిలుపును తెలుగుదేశంపార్టీ అందుకుంది. ప్రధాని పిలుపుకు ముందు నెల్లూరు వేదికగా మహానాడు కార్యక్రమాన్ని 3రోజులు నిర్వహించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తెలుగుదేశం.....దేశం యోగక్షేమాలు కోరి ఆ 3రోజుల కార్యక్రమాలను రద్దు చేసింది. మహానాడు కార్యక్రమాన్ని డిజిటల్ వేదికగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు తెలుగుదేశంపార్టీ నడుం బిగించింది. కార్యకర్తలందర్నీ డిజిటల్ వేదికగా మహానాడు కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. నేటి డిజిటల్ విప్లవంలో తెలుగుదేశంపార్టీ ఈ యేడాది నిర్వహించే హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం ఒక పెద్ద విప్లవాత్మక నిర్ణయంగా దేశ చరిత్రలోనే నిలవబోతుంది. తెలుగుదేశంపార్టీని డిజిటల్ యుగంలోకి అనుసంధానం చేయగల అనుభవజ్ఞులు, హార్వర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్ మా యువనాయకులు నారా లోకేష్ గారు సరికొత్త శకానికి నాంది పలకబోతున్నారు. సుమారు 2వేల క్లస్టర్ రీచ్ తో ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశంపార్టీ రికార్డు సాధించేలా ముందుకు వెళుతోంది.
*క్లస్టర్ లో కార్యకర్తలు - కేంద్ర కార్యాలయంలో అగ్ర నాయకులు :*
అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో నేతలతో భౌతికంగా మహానాడు నిర్వహిస్తారు. దానికి అనుసంధానంగా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి.. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడు ను అనుసంధానిస్తారు. ఎంపిక చేసిన నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలతో పాటు నేతలతో మాట్లాడిస్తారు. సాంకేతికత సాయంతో ప్రతి కార్యకర్తను నేరుగా అనుసంధానించే వినూత్న ప్రయత్నం. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,848 క్లస్టర్ల ద్వారా డిజిటల్ పద్ధతిలో మహానాడు జరగనుంది. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ తో వారిని మాట్లాడించడం ద్వారా.....ఒక రకమైన సంతృప్తి ఉండేలా చేస్తారు. మహానాడు హైబ్రిడ్ విధానం ద్వారా చేపట్టడం ద్వారా ఆదా అయిన సొమ్మును పార్టీ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. గతం మాదిరిగా వేలాదిమందికి మాత్రమే కాదు.. లక్షలాదిమందికి ఈసారి మహానాడు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నేరుగా పార్టీ సిద్ధాంతాలపై మరింత చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.. అయితే ఇప్పుడు హైబ్రిడ్ మహానాడు పై టిడిపి కంటే ఇతర రాజకీయ పార్టీల్లోనే ఎక్కువ ఆసక్తి ఉంది.
*స్త్రీశక్తి ప్రధాన అంశంగా ఈ యేడాది మహానాడు :*
స్త్రీశక్తి ప్రధాన అంశంగా ఈ యేడాది మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశంపార్టీ నిర్వహిస్తోంది. స్త్రీశక్తిలో భాగంగా మహిళా సంక్షేమం కోసం పార్టీ చేసిన కృషి, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహానాడు వేదిక బలంగా చర్చించనుంది. హైబ్రిడ్ విధానంనలో మహానాడు జరిగినా క్యాడర్ లో ఫుల్ జోష్ నింపడం, టెక్నాలజీ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడం, ప్రజలను అత్యధిక సంఖ్యలో భాగస్వామ్యం చేయడంలో ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుంది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా తెలుగుదేశం సత్తాను డిజిటల్ వేదికగా నిరూపించడానికి, ప్రపంచ రికార్డులు సాధించే దిశగా మహానాడు అడుగులు వేస్తోంది. కాక్రోచ్ జనతాపార్టీ లాంటి అంశాలపై కూడా మహానాడు చర్చించబోతుంది. ఆరోగ్యకరమైన సోషల్ మీడియా యాక్టివిటీని ప్రోత్సహించే విధంగా మహానాడు చర్చలు ఉండబోతున్నాయి.
*ప్రతిరోజు 6గంటల పాటు మహానాడు :*
హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమంలో ప్రతిరోజు 6గంటల పాటు పార్టీ తీర్మానాలు, రాష్ట్రాభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు డిజిటల్ మహానాడు జరగబోతుంది. క్లస్టర్ లో భారీ ఎల్.ఈ.డీ స్క్రీన్లు, ఆన్ లైన్ ద్వారా కేంద్ర కార్యాలయానికి అనుసంధానమై....పార్టీ నాయకులు, కార్యకర్తలంతా డిజిటల్ వేదికగా పాల్గొనబోతున్నారు. అన్న ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించేందుకు ప్రతి క్లస్టర్ వేదిక వద్ద ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం. క్లస్టర్ వద్ద ఉన్న పార్టీ నాయకులు ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం, మా తెలుగుతల్లికి మల్లెపూవు దండ పాటతో తెలుగుతల్లిని స్మరించుకుని కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాం. టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు, ఏర్పాట్లు ఇప్పటికే తీసుకున్నాం. ప్రతి క్లస్టర్ వద్ద ముందస్తు చర్యలతో అప్రమత్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. కార్యకర్తలు ఎవరూ అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లలో నాణ్యతా లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
*10రోజులుగా కేంద్ర కార్యాలయం నుండి పర్యవేక్షణ :*
రాష్ట్రవ్యాప్తంగా 1,848 క్లస్టర్లలో నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడు ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పరిశీలిస్తున్నాను. 10రోజుల నుండి తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉంటూ అన్ని క్లస్టర్లలో నాయకులు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్నాం. ఏర్పాట్లలో పాటించాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. ప్రతి క్లస్టర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి అనునిత్యం అనుసంధానమై ఉండేలా, ఎక్కడా టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా, కార్యకర్తలు నిరాశకు గురికాకుండా చేసేలా అవసరమైన ఏర్పాట్లను కట్టుదిట్టంగా తీసుకునేలా పార్టీ నేతలను అనునిత్యం అప్రమత్తం చేశాం. తెలుగుజాతి గర్వించే పసుపు పండుగకు రాష్ట్రవ్యాప్తంగా సర్వం సిద్ధం. ఈ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులంతా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment