Skip to main content

వినియోగంలో లేని టిడ్కో, రాజీవ్ గృహకల్ప ఇళ్ల కేటాయింపులు రద్దు చేసి అర్హులైన పేదలకు అప్పగించాలి… గంగవరం నిర్వాసితులకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలి* *-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు*


విశాఖపట్నం: విశాఖ సందేశం : మే 30:విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో అంశాలపై పల్లా శ్రీనివాసరావు స్పష్టమైన సూచనలు చేశారు.

 *టిడ్కో ఇళ్లపై తక్షణ చర్యలు అవసరం


ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... టిడ్కో, రాజీవ్ గృహకల్ప పథకాల కింద కేటాయించిన అనేక ఇళ్లలో లబ్ధిదారులు ఇప్పటికీ నివాసం ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల కేటాయింపులు జరిగి 17 నుంచి 18 సంవత్సరాలు గడిచినా, కొన్ని ఇళ్లకు ఇప్పటికీ తాళాలు కూడా వేయని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారుతున్నాయని, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ప్రభావం చుట్టుపక్కల నివసిస్తున్న కుటుంబాలపై తీవ్రంగా పడుతోందని పేర్కొంటూ, ఇంతకాలం గడిచినా ఇళ్లలో నివాసం ఉండని లబ్ధిదారుల కేటాయింపులను సమీక్షించి, అవసరమైతే రద్దు చేసి అర్హులైన పేద కుటుంబాలకు తిరిగి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ అంశాన్ని గతంలో పలుమార్లు ప్రస్తావించినప్పటికీ ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని పేర్కొనగా, ఈసారి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

 *పెన్షన్ల మంజూరులో జాప్యం వద్దు* 


గాజువాక నియోజకవర్గ పరిధిలో వితంతువులు, వికలాంగులు కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ల మంజూరులో జాప్యం జరుగుతోందని ప్రస్తావించారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ, సంబంధిత అధికారులను కోరారు.

*గంగవరం నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం చూపాలి* 


గంగవరం, దిబ్బపాలెం గ్రామాలకు చెందిన గంగవరం పోర్టు నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.లక్ష చొప్పున జీవనభృతి, ఇతర ఆర్థిక ప్రయోజనాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని పల్లా శ్రీనివాసరావు అధికారులను కోరారు. నిర్వాసితుల సమస్యలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వారికి రావాల్సిన నిధులను తక్షణమే జమ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ అంశంపైనా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

      ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం* గాజువాక నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వేదికపై ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా, పెండింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా అధికార యంత్రాంగంతో సమన్వయం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

                      K.V.SHARMA EDITOR 

Comments