విశాఖపట్నం, మే 29.ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజెఎఫ్) విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. మీడియా స్వేచ్ఛను హరించ వద్దని నినాదాలు చేశారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ్ కార్యవర్గ సభ్యులు కె.అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేక అంశాలపై విశ్లేషణలు చేస్తూ ఉంటారని, ఇటీవల ఆయన చేసిన ఓ వ్యాఖ్యను ఆధారంగా చేసుకుని ఆయనను కొందరు వ్యక్తిత్వ హననానికి పాల్పడడం శోచనీయమన్నారు. ఆయనపై సోషల్ మీడియాలో అసభ్యకర, పోస్టులు పెట్టడం మానుకోవాలని కోరారు . రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్య హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించినప్పటికీ ఆయనపై బెదిరింపులకు దిగడం తగదన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ఎన్.మధు, మదన్, ఈశ్వరరావు, రవిశంకర్, కె.రాజేష్, సతీష్, వరప్రసాద్, భాగ్యరాజ్, శివరామకృష్ణ, చిన్నా, సంతోష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment