వీధి సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్ కు వేధింపులే వైసీపీ అధికార దుర్వినియోగానికి నిదర్శనం: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.... దళితులపై అరాచకాలు, అణచివేత సజీవ సాక్ష్యాలు.... ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే ఆనందరావు ఆగ్రహం..
అమలాపురం, విశాఖ సందేసం...వైసీపీ పాలనలో *దళిత సామాజిక వర్గాలపై జరిగిన అరాచకాలు, అణచివేత మరియు వ్యవస్థాగత అన్యాయాలపై* అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని, వైసీపీ హయాంలో ఎస్సీలపై జరిగిన ప్రధాన దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో దళిత యువత భద్రత, శ్రమకు దక్కాల్సిన గౌరవం పూర్తిగా లోపించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా పాలకులు రాజకీయ అధికారంతో ఎలా దుర్వినియోగానికి పాల్పడ్డారో, జవాబుదారీతనం లేకుండా ఎలా వ్యవహరించారో చెప్పడానికి వీధి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్ల ఘటనలే సజీవ సాక్ష్యాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ, గత వైసీపీ ఎమ్మెల్సీ వద్ద మాజీ డ్రైవర్‌గా పనిచేసిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని, సదరు ఎమ్మెల్సీతో తలెత్తిన వివాదం కారణంగా దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు. బాధితుడి మృతదేహాన్ని తీసుకొచ్చి వాళ్ల ఇంటి వద్దే పడేసి, మొదట్లో దీనిని ఒక రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు కుట్రపూరిత ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అయితే తీవ్రంగా కొట్టడం వల్లే ఆయన మరణించాడని దర్యాప్తులో తేలిందని, రాజకీయ అండతో జరిగిన ఈ దారుణాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. అలాగే కోవిడ్-19 విపత్కర సమయంలో ప్రజల ప్రాణాల కోసం పీపీఈ కిట్ల కొరతపై ఆందోళన లేవనెత్తినందుకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ అనస్థిటిస్ట్ డాక్టర్ సుధాకర్‌ను దారుణంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయనను సస్పెండ్ చేయడమే కాకుండా, బహిరంగంగా అరెస్టు చేసి అవమానించారని, వైసీపీ పాలనలో ప్రశ్నించే గొంతుకలను ఎలా అణిచివేశారో మరియు దళిత వృత్తినిపుణులను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో చెప్పడానికి డాక్టర్ సుధాకర్ ఒక ప్రతీకగా మిగిలిపోయారని అన్నారు. ఈ దౌర్జన్యాలు, వ్యవస్థాగత అన్యాయాలపై దళిత యువజన సంఘాలు, ఆరోగ్య నిపుణులు మరియు స్థానిక వర్గాలలో అవగాహన కల్పించేందుకు నేటి నుండి (మే 19) మూడు రోజుల పాటు (మే 19, 20, 21 తేదీలలో) నియోజకవర్గవ్యాప్తంగా, ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో సంస్మరణ కార్యక్రమాలు, సామూహిక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా కాలనీ స్థాయిలో కొవ్వొత్తుల ప్రదర్శనలు, స్మృతి చిహ్నాల ఏర్పాటు మరియు డాక్టర్ సుధాకర్ జ్ఞాపకార్థం ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దళిత వ్యక్తులు, వృత్తిపరమైన నిపుణులు, మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపై జరిగిన విరంతర బెదిరింపులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దళిత హక్కుల సంఘాలు, స్థానిక యువత మరియు ప్రజలందరూ ఐక్యంగా నిలబడాలని ఎమ్మెల్యే ఆనందరావు పిలుపునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానులేనని, బాధితులకు ఆత్మగౌరవం, న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లాడ స్వామి నాయుడు, పెచెట్టి విజయలక్ష్మి, అధికారి జయలక్ష్మి, పెచ్చెట్టి చంద్రమౌళి, దెందుకూరి సత్తిబాబు రాజు, వేగిరాజు వెంకటరాజు, సుధా చిన్నా, గెద్దయ్య, పొలమూరి ధర్మపాల్, రాజలపూడి భీముడు, సూరిబాబు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఎస్సీ విభాగం నాయకులు, దళిత యువజన సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Srinivas Spl Correspondant



Comments
Post a Comment