Skip to main content

చెప్పుకోవడానికి చేసిందేమీ లేక చంద్రబాబు ఊకదంపుడు :మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైర్‌ సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ శుద్ధ అబద్ధం ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం :తేల్చిచెప్పిన బొత్స సత్యనారాయణ

 


విశాఖపట్నంలోని క్యాంప్‌ ఆఫీస్‌లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.

చంద్రబాబు వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ అందరికీ తెలుసు

ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకున్నారా ?

అయినా సిగ్గు లేకుండా సూపర్‌ హిట్‌ మాటలు

ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇచ్చారా ?

:బొత్స సత్యనారాయణ సూటి ప్రశ్న

డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు తీసేశారు?

టాపర్‌ వచ్చిన అభ్యర్ధి వివరాలు ఏవీ?

విద్యార్ధులకు కిట్లు, పుస్తకాలూ ఇవ్వలేరు

లోకేష్‌ తన శాఖ తప్ప అన్నీ మాట్లాడతారు

:బొత్స సత్యనారాయణ ఆక్షేపణ

రెండేళ్ల పాలనలో ఒక్క మంచి పనీ చేయలేదు 

పేటెంట్‌ గా చెప్పుకునే కార్యక్రమం ఒక్కటీ లేదు

పిల్లల్ని కనాలంటూ పిచ్చి సలహాలు ఇస్తారు

పరాకాష్టకు చేరిన చంద్రబాబు పబ్లిసిటి పిచ్చి 

:చంద్రబాబు తీరుపై బొత్స సత్యనారాయణ ధ్వజం

విశాఖపట్నం:

చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చెప్పుకోవడానికి ఏమీ లేక ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపేస్తున్నారని, ఇవాళ పూతలపట్టులో జరిగిన సభలో ఆయన మాటలే ఇందుకు నిదర్శనమని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, కేకే రాజుతో కలిసి బొత్స సత్యనారాయణ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చోటు చేసుకున్న అరాచకాల్ని ఒక్కొక్కటిగా వివరించారు. 

ప్రెస్‌ మీట్‌లో బొత్స సత్యనారాయణ ఇంకేమన్నారంటే..:

చేసిందేమీ లేక చంద్రబాబు ఊకదంపుడు:

ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు.. తాము ప్రజలకు చేస్తున్న మంచి ఏంటో చెప్పుకోవాలి కానీ విపక్ష నేతలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకు? రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు  వ్యవస్థల మేనేజ్‌మెంట్, మ్యానిపులేషన్‌ అన్నీ తెలుసు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడూ ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చి , అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క దాన్నీ నిలబెట్టుకోకుండా మోసం చేయడం అందరూ చూశారు. వ్యవసాయం శుద్ధ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తానని మహిళల్ని ఎలా మోసం చేసి మాయ చేశాడో కూడా అందరికీ తెలుసు. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అయిపోయిందని ఇప్పుడు మరో మోసం చేస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ చేసే ప్రయత్నం చేస్తాననడం వేరు సూపర్‌ హిట్‌ అయిందనడం వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది.

మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ఇచ్చారా, మూడు గ్యాస్‌ సిలెండర్లు ఇచ్చారా చెప్పాలి. మీ పరిపాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? అన్ని నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా?  

కోవిడ్‌ సంక్షోభంలోనూ ప్రజల్ని ఆదుకున్న జగన్‌:

కోవిడ్‌ సమయంలో రెండేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్‌గారు ఆదుకున్నారన్న విషయం గ్రామాల్లో వెళ్లి అడిగితే అర్దమవుతుంది. ఏమైనా అంటే తప్పించుకుని తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పబ్లిసిటీ, ప్రయాణాలకూ ఎక్కడైనా ఆటంకం ఉందా ? పేదల మనుగడకు, విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, పేదల వైద్యానికీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలకే ఆటంకాలన్నీ. కానీ చంద్రబాబు మాటలు చూస్తే కోటలు దాటి పోతున్నాయి. 

ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. చంద్రబాబు ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో, వాటిని ఎంత వరకూ నిలబెట్టుకున్నారో ఆలోచించాలి. డీజిల్, పెట్రోల్‌ ధరలు తగ్గించారా చెప్పాలి. ఇరాన్‌ యుద్దం వల్ల దేశమంతా రేట్లు పెరిగాయి. కానీ రాష్ట్రంలో పెంచిన ధరల్ని మాత్రం తగ్గించలేరా? రైటు పండించిన పంటకు మాత్రం ధర లేదు. రైతు పరిస్ధితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుంది. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు ఏం చేస్తున్నాయో అర్ధం కావట్లేదు. మా ప్రాంతంలో జొన్నల గురించి రెండేళ్లుగా నేను అడుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోతున్నారు. గత ప్రభుత్వంలా మార్కెట్‌ అస్దితరపై ఎందుకు జోక్యం చేసుకోలేకపోతున్నారు?


తన శాఖ అన్నీ మాట్లాడే విద్యామంత్రి లోకేష్‌:

పుస్తకాలు అంటూ రాస్తే చంద్రబాబు గురించి రాయాలి. ఏ రకంగా ప్రజాస్వామ్యంలో అవకాశాలు వినియోగించుకుని, మాయ మాటలు చెప్పి, సామాన్య ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందులో రాయాలి. ప్రజల కష్టాల మీద ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. ఎంతసేపూ చట్టాలు చేతుల్లో తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్న మెగా డీఎస్సీ అన్నారు. ఓ ఉద్యోగి ఐఏఎస్‌ టాపర్‌ వచ్చాడని తెలిసి ఆన్‌ లైన్‌ లో పెట్టిన మెరిట్‌ లిస్ట్‌ తీసేశారు. ఇదేనా మీ పాలన? విద్యాశాఖ మంత్రి తన శాఖ వదిలి మిగతా శాఖల గురించి మాట్లాడతారు. విద్యార్ధులకు ఇచ్చే పాఠ్యపుస్తకాలు, కిట్లు పేరెంట్స్‌ టీచర్‌ మీటింగ్‌ రోజు ఇస్తామంటున్నారు. కానీ ఆ పీటీఎం ఎప్పుడో మాత్రం చెప్పరు.

ఈ ప్రభుత్వంలో పారదర్శకత అంటూ చెప్పుకుంటూ ప్రతీదీ దాపరికమే. నీతిగా పాలన అయినా చేస్తున్నారా అంటే వైజాగ్‌ గీతం భూముల్ని ఎలా దోచుకుంటున్నారో  ప్రజలు చూశారు. ఆంధ్రా యూనివర్శిటీని తాకట్టు పెట్టేలా ప్రభుత్వ తీరు ఉంది. ప్రభుత్వ పెద్దలకు కానీ, వాళ్ల తాబేదార్లకు సంబంధం ఉంటే మాత్రం ఆ అంశాన్ని ఎలా నీరుగార్చాలా అని చూస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. 

రెండేళ్లలో పేదలకు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా?:

టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. పేదలు, మధ్య తరగతికి ఇది చేశాం అని పేటెంట్‌ గా చెప్పుకునే కార్యక్రమం ఒక్కటైనా ఉందా? రైతులకు కానీ, సామాన్యులకు కానీ, విద్యార్ధులకు కానీ ఏమైనా చేస్తే చెప్పండి. లేదా నీతివంతమైన పాలన అందిస్తున్నామని చెప్పుకునే పరిస్ధితి ఉందా చెప్పాలి. మండల స్దాయి కార్యాలయాలకు వెళ్తే ఎంత అవినీతి జరుగుతుందో తెలుస్తుంది. అధికారంలో ఉన్న నాయకులు, అధికారులు కలిసి కింది స్దాయిలో దోచుకుంటున్నారు. దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చి. 

రాష్ట్రంలో ధరలు కనీసం 15–20 శాతం పెరిగాయి. దానికి తగినట్లుగా రాబడి పెరిగిందా అంటే శూన్యం. ఇంకా ముగ్గుర్ని కంటే 30 వేలు, నలుగురిని కంటే 40 వేలు ఇస్తామంటూ పిచ్చిమాటలు చెప్తున్నారు. ఉన్న వాళ్లకు ఉద్యోగానికి దిక్కులేదు కానీ ముగ్గుర్ని, నలుగురిని కనాలట. అందరూ మీలా ధనవంతుల్లా ఉంటారా, లేక రెండెకరాలు నుంచి ఆస్తులు పెంచుకునే మంత్రాలు మీలా అందరి దగ్గర ఉంటాయా చంద్రబాబు చెప్పాలి. ఇప్పటివరకూ ఎంతమందికి పీ–4 ఇచ్చారో చంద్రబాబు బయటపెట్టాలి. 

ఈ మాటలతో ఎంత కాలం జనాన్ని మభ్య పెడతారని అడిగితే సమాధానం చెప్పరు. మీకున్న ప్రసార మాధ్యమాలతో బుల్‌ డోజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదల ఆకలిని ఎంతకాలం ఇలా దాచిపెట్టగలరో చూద్దాం. రెండేళ్లయినా ఉద్యోగులకు పీఆర్సీ వేసే దిక్కులేదు. ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రంలో ఉండాలంటే కడుపు తరుక్కుపోతోంది. ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా పాలన చేస్తోంది. 


ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం..:

ప్రతీవారం అప్పు తీసుకుంటున్న డబ్బుల్ని అవినీతికి ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అవినీతి చూడలేక జగన్‌గారు మావిగన్‌ ప్రతిపాదించారు. దానికి మీకెందుకు బాధ ? ఈ అవినీతి, దోపిడీ చూసి రేపు ఆ ప్రాంతంలోని మచిలీపట్నం, గన్నవరం ప్రజలే మిమ్మల్ని అడుగుతారు. 

ఏ అంశం చూసినా కుంభకోణం, పక్షపాతమే. ఎక్కడా పారదర్శకత లేదు. విద్యార్ధుల కోసం డీఎస్సీ పెడితే లీకేజ్‌ జరిగి మెరిట్‌ లేకుండా స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని వార్తలు వస్తున్నాయి. విద్యాశాఖ, పోలీసు శాఖలు ఏం చేస్తున్నాయి? ఎంతసేపూ ఏ రాజకీయ పార్టీ చూసుకుని ప్రయోజనాలు కల్పించడమేనా వీటి పని? ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ఎక్కడా లీకేజిలు లేకుండా పాలన జరగాలనేది మా ఉద్దేశం. ఆ దిశలో నిరంతరం ప్రయత్నిస్తాం. ప్రశ్నిస్తూనే ఉంటామని, అవసరమైతే చొక్కా విప్పి వీధుల్లో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

Comments