అందరినీ ప్రేమించండి -అందరినీ సేవించండి" — రక్తదానంతో మానవత్వానికి స్ఫూర్తిగా నిలిచిన విశాఖ ఉక్కు ఉద్యోగులు
ప్రాణదాన సేవలో విశిష్ట సేవలందించిన ఇద్దరు విశాఖ ఉక్కు ఉద్యోగులను సన్మానించిన RINL డైరెక్టర్ (ఆపరేషన్స్ ) డా. సలీం జి. పురుషోత్తమన్
మానవత్వం, కరుణ, నిస్వార్థ సేవకు ప్రతీకలుగా నిలిచిన RINL–విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన ఇద్దరు ఉద్యోగులను RINL - విశాఖ ఉక్కు కర్మాగారం డైరెక్టర్ (ఆపరేషన్స్) డా. సలీం జి. పురుషోత్తమన్ , అభినందించి సన్మానించారు.
రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (వర్క్స్) విభాగానికి చెందిన జనరల్ ఫోర్‌మన్ (మెకానికల్) శ్రీ కె.వి.ఎల్. నారాయణ రెడ్డి గారు 63 సార్లు రక్తదానం చేసి అనేకమంది ప్రాణాలను కాపాడగా, సేఫ్టీ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డీజీఎం శ్రీ కర్రి శ్రీనివాస్ గారు అరుదైన రక్తాన్ని 58 సార్లు దానం చేసి ఎందరో అవసరమైన వారికి ప్రాణాధారంగా నిలిచారు.
ఈ సందర్భంగా డా. సలీం జి. పురుషోత్తమన్ మాట్లాడుతూ, తమ అధికారిక బాధ్యతలను అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తూ, సమాజానికి ప్రాణదాన సేవ చేయడం ఎంతో గొప్ప విషయం అని ప్రశంసించారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు బోధించిన “Help Ever… Hurt Never” అనే దివ్య సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ, ఈ ఇద్దరు విశాఖ ఉక్కు ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.
రక్తదానం మానవాళికి చేసే అత్యున్నత సేవలలో ఒకటని, ఒక యూనిట్ రక్తం అనేక ప్రాణాలను కాపాడగలదని ఆయన అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం ఈ మహోన్నత సేవను కొనసాగిస్తున్న శ్రీ కెవిఎల్ నారాయణ రెడ్డి గారు మరియు శ్రీ కర్రి శ్రీనివాస్ గారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా సహోద్యోగులు కూడా ఇద్దరు అధికారుల సేవా స్పూర్తిని కొనియాడుతూ, వారి సేవలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
K.VSHARMA EDITOR



Comments
Post a Comment