శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. * భక్తుల సౌకర్యార్థం నిత్య అన్నప్రసాద భవనం వద్ద నూతన శౌచాలయం. * క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి తక్షణ పరిష్కారం చూపిన ఈఓ జల్లేపల్లి వెంకట్రావు * అన్నప్రసాద భవనంలో భక్తులతో ముచ్చటించి, భోజననాణ్యతను పరిశీలించిన.ఇఓ
సింహాచలం, మే 30, 2026:సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు ప్రత్యేక చొరవతో నిత్య అన్నప్రసాద భవనం సమీపంలో నూతనంగా నిర్మించిన శౌచాలయ సముదాయాన్ని శనివారం భక్తుల వినియోగం కోసం ప్రారంభించారు.
ఇటీవల నిత్య అన్నప్రసాద భవనాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడ శౌచాలయ సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈఓ గుర్తించారు. దీనిపై వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన శౌచాలయ నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈఓ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ విభాగం అత్యంత వేగంగా పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈఓ అన్నప్రసాద భవనాన్ని సందర్శించి అక్కడ భోజనం చేస్తున్న భక్తులతో ముచ్చటించారు. దర్శన ఏర్పాట్లు, భోజన నాణ్యత, దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దేవస్థానం కల్పించిన సదుపాయాలు, అన్నప్రసాద నాణ్యత పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఈఓ హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం భక్తులకు వడ్డిస్తున్న అన్నప్రసాదాన్ని పరిశీలించిన ఈఓ, బియ్యం, కూరగాయలు, సాంబారు, పెరుగు తదితర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. భక్తులకు ఎల్లప్పుడూ పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాన్ని అందించాలని అన్నదాన విభాగం అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యాలు, సేవల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
శనివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఈఓ కేశఖండనశాలను కూడా పరిశీలించారు. తీవ్ర ఎండలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అందిస్తున్న మజ్జిగ, తాగునీటి సౌకర్యాలపై ఆరా తీసి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
అలాగే ఆలయంలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ, వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా త్వరితగతిన దర్శనాలు పూర్తయ్యేలా అధికారులకు పలు సూచనలు జారీ చేసి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు.
భక్తుల అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా సింహాచలం దేవస్థానం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఈఓ జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు.
K.V.SHARMA EDITOR





Comments
Post a Comment