శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం కృష్ణాపురం గోశాలలో ఆధ్యాత్మిక వైభవంగా శ్రీ నృసింహ జయంతి.
సింహాచలం: 30 మే 2026ప్రకృతి సోయగాలకు, పవిత్రతకు ప్రతీకగా నిలిచిన సింహాచలం క్షేత్ర పరిసర ప్రాంతమైన కృష్ణాపురం గోశాల నృసింహ వనములో
శ్రీ నృసింహ జయంతి భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. పచ్చని కొండలు, సుందరమైన ప్రకృతి వాతావరణం, ఔషధ గుణాలు కలిగిన మొక్కల నడుమ వెలసిన ఈ పవిత్ర ప్రదేశం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ ప్రత్యేక దైవానుభూతిని కలిగించింది.
ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవమైన సింహాద్రి అప్పన్న కృపాకటాక్షాలు సర్వలోకాలకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, వేదాశీర్వచనాలు, నృసింహ స్వామి మహిమను వివరిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
భక్తి సకల దేవతా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి మాధవి బృందం నిర్వహించిన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, కోలాటాలు, భక్తి గీతాలు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చాయి.
నృసింహ భక్తి పారవశ్యంలో భక్తులు పాల్గొని స్వామివారి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
దేవస్థాన వేదపండితులు శ్రీకాంతాచార్యులు, రఘు, రాజేష్, కపిలవాయి శర్మల పర్యవేక్షణలో వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక , పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నృసింహ స్వామి అవతార మహిమను, ధర్మ పరిరక్షణలో ఆయన పాత్రను భక్తులకు వివరించి ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, “భక్తులందరికీ శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి అనుగ్రహం లభించాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ధార్మిక చింతన పెంపొందాలని” ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, సహాయ కార్యనిర్వహణాధికారి వి .రమణమూర్తి,పంతం శ్రీనివాస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ i /c తాతాజీ, పర్యవేక్షణాధికారి శ్రీమతి సత్యవాణి, మూలా వాసు, పీఆర్వో నాయుడు, దేవస్థాన అధికారులు, సిబ్బంది, గోశాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నృసింహజయంతి సందర్భంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక మహోత్సవం భక్తుల హృదయాలలో భక్తి, విశ్వాసాలను మరింత పెంపొందించడమే కాకుండా, సనాతన ధర్మ పరిరక్షణకు సింహాచలం దేవస్థానం చేస్తున్న కృషికి మరో మైలురాయిగా నిలిచింది.
శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దివ్య కృప సర్వలోకాలపై ప్రసరించాలని భక్తులు ప్రార్థించారు.
జై శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి!
K.V.SHARMA EDITOR











Comments
Post a Comment