అమలాపురం, విశాఖ సందేసం...మే 16 నుండి 21 వరకు బెంగళూరులో నిర్వహిస్తున్న “వన్ నేషన్ – వన్ ఎలక్షన్” జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యయన పర్యటనలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. “వన్ నేషన్ – వన్ ఎలక్షన్” అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణల పరిశీలనకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) అధ్యయన పర్యటనలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పి. పి. చౌధరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలు, సంప్రదింపుల కార్యక్రమాలలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, పరిపాలనా అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు పౌరసమాజ ప్రతినిధులతో కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చలు జరిపారు.
అధ్యయన పర్యటన తొలి రోజు కర్ణాటక ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు కెనరా బ్యాంక్, హెచ్‌ఏఎల్ , బీఈఎల్, బీఈఎంఎల్ , బీహెచ్‌ఈఎల్ , కియోసీఎల్, కేపీఎల్ , ఐటీఐ లిమిటెడ్, ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ మరియు ఐఐఎం బెంగళూరు ప్రతినిధులతో కమిటీ సమావేశమైంది. సమకాలీన ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిపాలనా, సంస్థాగత, ఎన్నికల నిర్వహణ మరియు పాలనాపరమైన అంశాలపై పలుముఖ కోణాల్లో చర్చలు జరిగినట్లు సమాచారం. కర్ణాటకకు చెందిన వివిధ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ వర్గాలతో కూడా కమిటీ విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలను కమిటీ ముందు వివరించగా, భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (సెక్యులర్), ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ప్రతినిధులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ది కాన్స్టిట్యూషన్ (129వ సవరణ) బిల్లు 2024” మరియు “యూనియన్ టెరిటరీస్ లాస్ (సవరణ) బిల్లు – 2024”లకు సంబంధించిన అంశాలపై కమిటీ వివిధ కోణాల్లో అధ్యయనం చేపట్టింది. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనకు సంబంధించిన రాజ్యాంగ, పరిపాలనా, ఆర్థిక మరియు సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ అంశాలపై సమావేశంలో సవివరంగా చర్చించినట్లు తెలిసింది. తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలనపై పడుతున్న భారం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుతో అభివృద్ధి కార్యక్రమాలకు కలుగుతున్న అంతరాయం, ప్రభుత్వ వ్యయభారం తగ్గింపు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో సమాఖ్య వ్యవస్థ, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై కూడా పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా కమిటీ సభ్యునిగా పాల్గొన్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి సంబంధించి ప్రతి అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కమిటీ తన నివేదికను రూపొందిస్తుందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ ఎన్నికల వ్యవస్థకు సంబంధించి ప్రాముఖ్యత కలిగిన ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధ్యయన పర్యటనలు కొనసాగిస్తోందన్నారు.
Srinivas Spl Correspondant



Comments
Post a Comment