Skip to main content

బి.ఆర్.టి.ఎస్ రోడ్డులో e-RT-( ఎలక్ట్రిక్ రాపిడ్ ట్రాన్సిట్ )వ్యవస్థ ఏర్పాటుపై జీవీఎంసీ కమిషనర్ పరిశీలన.


విశాఖపట్నం, మే 21: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం నగరంలోని బి.ఆర్.టి.ఎస్ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రజా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా e-RT (Electric Rapid Transit) ఎలక్ట్రిక్ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి  జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ పి వి సత్యనారాయణ రాజు , చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకర్ రావు,ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ పోలీస్ కె.ప్రవీణ్ కుమార్, పెందుర్తి మండల రెవెన్యూ అధికారి వెంకటరమణ ,స్విట్జర్లాండ్ కు చెందిన HESS  గ్రీన్ మొబిలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో కలిసి పెందుర్తి జంక్షన్ వద్ద పరిశీలన నిర్వహించారు.


ఈ పరిశీలనలో  పెందుర్తి జంక్షన్ నుండి కాన్వెంట్ జంక్షన్ వరకు రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజలు వాహనాల రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ఆధునిక ప్రజా రవాణా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ e-RT వ్యవస్థపై కార్యాచరణ చేపట్టే దిశగా అధికారులు చర్చించారు.


ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు మెట్రో తరహా సౌకర్యాలతో కూడిన రోడ్డు ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థను అందించడమే లక్ష్యమని తెలిపారు. e-RT వ్యవస్థ ద్వారా ప్రత్యేక కారిడార్లలో ఎలక్ట్రిక్ బస్సులు వేగవంతంగా, సురక్షితంగా మరియు పర్యావరణ హితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.



HESS సంస్థ ప్రతినిధులు e-RT వ్యవస్థ ప్రత్యేకతలను వివరించారు. ఈ వ్యవస్థలో అధిక సామర్థ్యంతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులు ఒకేసారి 240 మందికి పైగా ప్రయాణికులను తరలించగలవని, రోజుకు సుమారు 23 గంటలపాటు సేవలు అందించగల సామర్థ్యం కలిగి ఉంటాయని తెలిపారు. అదేవిధంగా HESS సంస్థకు 140 సంవత్సరాలకు పైగా ఇంజనీరింగ్ అనుభవం ఉండటంతో పాటు, యూరప్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో ఈ e-RT వ్యవస్థ విజయవంతంగా అమలులో ఉందని వివరించారు.




ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్య నియంత్రణ, వేగవంతమైన ప్రజా రవాణా సేవలు అందించడం వంటి అంశాల్లో e-RT వ్యవస్థ కీలక పాత్ర పోషించనుందని అధికారులు అభిప్రాయపడ్డారు.



ఈ పరిశీలనలో బస్ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేక మార్గాల అభివృద్ధి, ఎలక్ట్రిక్ బస్సుల రాకపోకలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అధికారులు స్థల పరిశీలన నిర్వహించారు. ఈ విషయమై ఆర్టీసీ, ఈపీడీసీఎల్, ట్రాఫిక్ పోలీస్, జీవీఎంసీ, రెవెన్యూ, తదితర సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రధాన ఇంజనీర్ కు కమిషనర్ ఆదేశించారు. 



ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్  రామ్మోహన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రామలింగేశ్వర రెడ్డి ,HESS ప్రాజెక్టు ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ ,ప్రాణేష్ ఎన్ నాయక్, జీవీఎంసీ టెక్నికల్ అడ్వైజర్ కెవిఎన్ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

పౌర సంబంధాల అధికారి ,జీవీఎంసీ

                    K.V.SHARMA EDITOR 

Comments