జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 08.06.2026
ఈరోజు అనగా తేదీ 08.06.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారి ఆదేశానుసారం విశాఖపట్నం జిల్లాలో మహిళా ఆరోగ్య కార్యకర్తలకు ARMMAN స్వచ్ఛంద సంస్థ సహకారంతో అధిక ప్రమాదకర గర్భధారణ సమస్యల గుర్తింపు, నిర్ధారణపై శిక్షణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి. జగదీశ్వర రావు మాట్లాడుతూ, గర్భిణుల సమస్యలను ముందుగానే గుర్తించి, ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు.
ఆరోగ్య సిబ్బంది గర్భిణులను కలిసి పోషకాహారం, వైద్య పరీక్షలు, వ్యాయామంపై అవగాహన కల్పించాలి. అధిక ప్రమాదకర పరిస్థితులను గుర్తించడంలో అవగాహన లోపించడం వల్ల చాలా మంది మహిళలు, నవజాత శిశువులు మరణాలు, అనారోగ్యాలకు గురవుతున్నారని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు.
LMS అప్లికేషన్ ద్వారా ANMలు అధిక ప్రమాద గర్భధారణలకు సంబంధించిన పాఠ్యాంశాలను వీడియోల రూపంలో నేర్చుకోవచ్చు. ఈ యాప్‌లో సీనియర్ గైనకాలజిస్టుల చర్చలు, వైద్య మార్గదర్శకాలు, క్విజ్‌లు ఉంటాయి. శిక్షణానంతరం కూడా ఈ యాప్ ద్వారా ఆరోగ్య సిబ్బంది తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. తాజా వైద్య సమాచారం, కొత్త HRP కంటెంట్ కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
ARMMAN చాట్‌బాట్ ద్వారా ANMలు గర్భిణీ సంరక్షణ (ANC), అధిక ప్రమాద గర్భధారణలకు సంబంధించిన సందేహాలను 24 గంటలూ, వారంలో 7 రోజులూ సందేశం లేదా వాయిస్ రూపంలో అడిగి తక్షణమే సమాధానాలు పొందవచ్చు.
గర్భిణులకు మెరుగైన సేవలు, సురక్షిత ప్రసవాలు, మాతృ మరణాలు లేకుండా చేయడం, అధిక ప్రమాద గర్భధారణ, రక్తహీనత, అధిక రక్తపోటు, మూర్ఛరోగం, మధుమేహం వంటి అంశాలపై డాక్టర్ దుర్గా కళ్యాణి వివరించారు. ARMMAN స్వచ్ఛంద సంస్థ సిబ్బంది డాక్టర్ శివప్రసాద్ శిక్షణకు సంబంధించిన కోర్సు మెటీరియల్ సరఫరా చేసి, గ్రామస్థాయిలో వారి విధుల గురించి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వుమెన్ హెల్త్ ఆఫీసర్, డా.ఎన్.వి.సమత, డిపిఎమ్ఒ డా.బి. ఉమావతి, భీమిలి పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వారు, డిపిహెచ్ఎన్ఓ ఎం.సత్యవతి, అర్మాన్ వైధ్యాధికారి, సిబ్బంది మరియు మహిళా ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం.

Comments
Post a Comment