Skip to main content

*▪️ గులకరాయి డ్రామా నుండి వైఎస్సార్ విగ్రహం ధ్వంసం వరకు... గొడ్డలి పార్టీది రాజకీయ నాటకాల పరంపరే* *▪️ రోజుకో అబద్ధం.. వారానికో కుట్ర.. నెలకో అరాచకం.. ఇవే గొడ్డలి పార్టీ సిద్ధాంతాలు* *▪️ రాష్ట్ర అభివృద్ధి పై వైసీపీ విషం* *▪️ 11 సీట్లకు పరిమితమైనా మారని గొడ్డలి పార్టీ వైఖరి...* *-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు*

                      K.V.SHARMA EDITOR 


అమరావతి, జూన్ 05:* ఐదేళ్ల అరాచకం, అవినీతి, రాజకీయ కుట్రలు, వెన్నుపోట్లు, గొడ్డలి వేట్లు భరించిన ప్రజలు సరిగ్గా రెండేళ్ళ క్రితం గొడ్డలి పార్టీకి 11 సీట్లకు పరిమితం చేసినా గొడ్డలి పార్టీ నాయకులకు బుద్ధి రాకపోవడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు. కోడి కత్తి నుండి నేడు వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం వరకూ తానే డ్రామాలు ఆడించి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడం గొడ్డలి పార్టీ అధినాయకుడికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ రాజకీయాలు పూర్తిగా అబద్ధాలు, కుట్రలు, మభ్యపెట్టే డ్రామాల చుట్టూనే తిరుగుతున్నాయని దుయ్యబట్టారు.

 *అధికారంలో అరాచకం... ప్రతిపక్షంలో కుట్రలు* 

“అధికారంలో ఉన్న ఐదేళ్లు కుల, మత, ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన గొడ్డలి పార్టీ... ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా మీరు పనికిరారు అని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా అదే విష రాజకీయాలను కొనసాగిస్తోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రతి రోజూ కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేయడం జగన్ రెడ్డి రాజకీయ వ్యూహంగా మారిందని విమర్శించారు.

 *కోడికత్తి, గులకరాయి నుండి నేడు వైఎష్ఆర్ విగ్రహం ధ్వంసం వరకు... సానుభూతి రాజకీయాలే* 

సానుభూతి కోసం కోడికత్తి డ్రామా ఆడింది గొడ్డలి పార్టీనేనని, ఎన్నికల ముందు గులకరాయి నాటకానికి తెరలేపింది కూడా అదే పార్టీయేనని పల్లా ఆరోపించారు. రాజకీయ ప్రయోజనం కోసం ఏ స్థాయికైనా దిగజారడం జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందన్నారు. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న చరిత్ర జగన్ రెడ్డిదేనని విమర్శించారు. అసలు నిందితులను కాపాడుతూ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం, నిజాలు బయటపడకుండా కథలు అల్లడం గొడ్డలి పార్టీ రాజకీయాలకు నిదర్శనమన్నారు.

అభివృద్ధిపై నిరంతర విష ప్రచారం 

రాజధాని అమరావతి నుంచి విశాఖలో పెట్టుబడుల వరకు ప్రతి అభివృద్ధి కార్యక్రమంపై బురదజల్లడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారిందని పల్లా మండిపడ్డారు. విశాఖలో టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు భూములు కేటాయిస్తే కోర్టుల్లో కేసులు వేయడం, పెట్టుబడిదారుల్లో భయాందోళనలు సృష్టించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నించారని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం కాఫర్ డ్యామ్, అమరావతి నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు వంటి ప్రతి అంశంపై విష ప్రచారం చేయడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవడమే వారి లక్ష్యంగా మారిందన్నారు.

 *దేవాలయాలపైనా రాజకీయాలు* 

తిరుమల, శ్రీశైలం వంటి పవిత్ర క్షేత్రాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం గొడ్డలి పార్టీ దిగజారుడుతనానికి పరాకాష్ట అని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాలలు, లడ్డూ ప్రసాదాలు, క్యూలైన్ల అంశాలపై తప్పుడు ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని చూశారని విమర్శించారు. పవిత్రమైన దేవాలయాల ప్రసాదాల్లో సైతం మేకులు, కీటకాలు, వెంట్రుకలు ఉన్నాయంటూ ప్రచారం చేసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని అన్నారు.

 *జగన్ పర్యటనలన్నీ అరాచకం సృష్టించడానికే...* 

మిర్చి రైతులను పరామర్శించే పేరుతో వెళ్లి అల్లర్లు సృష్టించడం, రైతుల కష్టార్జిత పంటలను నాశనం చేయడం, పొగాకు రైతుల ఉద్యమాల పేరుతో మహిళలపై దాడులు చేయించడం గొడ్డలి పార్టీ రాజకీయ సంస్కృతికి నిదర్శనమన్నారు. అంబేద్కర్ విగ్రహాల అంశాలను దళితులను రెచ్చగొట్టేందుకు ఉపయోగించుకోవడం, సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించడం కూడా అదే రాజకీయాల్లో భాగమని విమర్శించారు. గంజాయి కేసుల్లో నిందితులను, రౌడీషీటర్లను పరామర్శించి వారిని అమాయకులుగా చిత్రీకరించడం ద్వారా నేరాలను ప్రోత్సహించిన పార్టీ గొడ్డలి పార్టీయేనని పల్లా ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రతి అంశంలోనూ రాజకీయ లబ్ధి కోసం వ్యవహరించడం వారి నైజమన్నారు. తాజాగా నంద్యాలలో వెలుగులోకి వచ్చిన వైఎస్సార్ విగ్రహాల ధ్వంసం ఘటనలో బయటపడుతున్న వాస్తవాలు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని పల్లా పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలే వీటి వెనుక ఉన్నాయని అన్నారు.

 *అధికారంలో ఉంటే దోపిడీ... ప్రతిపక్షంలో ఉంటే కుట్రలు* 

వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణల నుంచి అనేక అవినీతి కేసుల వరకు గొడ్డలి పార్టీ నేతల చరిత్ర ప్రజలకు తెలుసునన్నారు. ప్రజా ఆస్తులపై కన్నేసి అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్న ముఠా ఇప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. అరాచక పాలన, కక్షసాధింపు రాజకీయాలు, అభివృద్ధి విధ్వంసం, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చి గొడ్డలి పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని పల్లా గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రజా తీర్పు నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇంకా అదే అబద్ధాలు, అదే కుట్రలు, అదే రాజకీయ డ్రామాలతో ముందుకు సాగడం దురదృష్టకరమన్నారు.

 *ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* 

రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో పయనిస్తుంటే పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు ముందుకు సాగకుండా, ప్రాజెక్టులు అమలు కాకుండా సైంధవుల్లా అడ్డుపడటం గొడ్డలి పార్టీ ఏకైక లక్ష్యంగా మారిందని విమర్శించారు. ప్రజల సంక్షేమం కంటే రాజకీయ పబ్బం గడుపుకోవడమే వారికి ముఖ్యమైందన్నారు. ప్రతి నెలా కొత్త డ్రామా, ప్రతి రోజూ కొత్త కుట్రలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్న ఇలాంటి శక్తుల పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు, అభివృద్ధి ప్రయాణాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకమై అభివృద్ధి పక్షాన నిలవాలని పల్లా శ్రీనివాసరావు కోరారు.

Comments