శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. * అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతానికి సింహాచలంలో యోగ శిక్షణ కార్యక్రమం * ఉత్సాహంగా పాల్గొన్న దేవస్థాన ఉద్యోగులు * జూన్ 21 యోగా దినోత్సవంలో భాగస్వాములు కావాలని ఈఓ జల్లేపల్లి వెంకటరావు పిలుపు.
సింహాచలం, జూన్ 8, 2026:12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం ఆధ్వర్యంలో సోమవారం కొండపై యోగ శిక్షణ కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో దేవస్థాన ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగాసనాలు, ప్రాణాయామ సాధనలను అభ్యసించారు.
ఈ సందర్భంగా యోగ శిక్షకులు రమణ మాస్టారు, శ్రీదేవి టీచర్ పర్యవేక్షణలో పద్మాసనం, శీర్ష సంచలనం, స్కంధ సంచలనం, ఉదరాకర్షణాసనం, ఉత్కటాసనం, తాడాసనం, వృక్షాసనం, పాదహస్తాసనం, అర్ధచక్రాసనం, త్రికోణాసనం, శవాసనం, యోగ నిద్ర, నాడీశుద్ధి ప్రాణాయామం తదితర యోగాభ్యాసాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు మాట్లాడుతూ, యోగా మన భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మహోన్నత జీవన విధానమని పేర్కొన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు జూన్ 20వ తేదీ వరకు ప్రతిరోజూ నిర్వహించనున్న యోగాభ్యాస కార్యక్రమాలలో దేవస్థాన ఉద్యోగులు, విద్యార్థులు, భక్తులు, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
అలాగే జూన్ 21, 2026న నిర్వహించనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
కార్యనిర్వహణాధికారి
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం



Comments
Post a Comment