శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం * అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతానికి యోగ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం * జూన్ 8 నుంచి 21 వరకు యోగాభ్యాసం – జూన్ 21న జరిగే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఈఓ జె. వెంకటరావు పిలుపు
సింహాచలం, జూన్ 6, 2026 :ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం ఆధ్వర్యంలో ప్రత్యేక యోగ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
జూన్ 8వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సింహాచలం కొండపై యోగాభ్యాస శిబిరాలు నిర్వహించబడనున్నాయి.
ఈ కార్యక్రమాల్లో ఆలయ ఉద్యోగులు, వేద విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జె. వెంకటరావు కోరారు.
యోగా భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాల ప్రతీక అని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ, సృజనాత్మకతను పెంపొందించే మహోన్నత సాధనమని తెలిపారు.
ప్రస్తుతం వేగంగా మారుతున్న డిజిటల్ యుగంలో యువత యోగాను కేవలం వ్యాయామంగా కాకుండా జీవన విధానంగా స్వీకరించాలని ఆయన సూచించారు.
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కోసం రోజుకు కనీసం ఒక గంట యోగాకు కేటాయించాలని పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిందని, “ఒకే భూమి – ఒకే ఆరోగ్యం” అనే స్ఫూర్తితో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విజన్–2047, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంతో అవసరమని వివరించారు.
జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందస్తు సన్నాహకంగా ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని, అందువల్ల జూన్ 8 నుంచి జరిగే యోగాభ్యాస కార్యక్రమాలకు హాజరై, జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆలయ ఉద్యోగులు, విద్యార్థులు, భక్తులు, గ్రామస్తులు మరియు ప్రజలందరికీ ఈఓ శ్రీ జె. వెంకటరావు విజ్ఞప్తి చేశారు.
“యోగా – ఆరోగ్యానికి మార్గం, ఆనందానికి ఆధారం.
ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వాములై అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేద్దాం.”
కార్యనిర్వహణాధికారి
శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం

Comments
Post a Comment