Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర చర్యలు ..................... ఈవో జల్లేపల్లి వెంకట్రావు

                      K.V.SHARMA EDITOR 


సింహాచలం, జూన్ 11, 2026 :జూలై 28, 29 తేదీలలో జరగనున్న పవిత్ర గిరి ప్రదక్షిణ మహోత్సవం సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గురువారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, పోలీసు, ట్రాఫిక్ శాఖల అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.



స్వామివారి తొలి పావంచ వద్ద జరిగిన సమీక్షలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, డిప్యూటీ ఇంజనీర్ (ఐ/సి) రామరాజు, గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ సీఐ సన్యాసినాయుడు, ట్రాఫిక్ సీఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరాల గిరి ప్రదక్షిణ సందర్భంగా ఎదురైన అనుభవాలు, భక్తుల సూచనలు, రద్దీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మరింత సమర్థవంతమైన ఏర్పాట్లపై చర్చించారు.



ఈ సందర్భంగా ఈవో జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రతి అంశాన్ని ముందుగానే ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 


భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పోలీసు శాఖతో సమన్వయం చేసి ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటు, రద్దీ నియంత్రణ, తప్పిపోయిన పిల్లలు మరియు వృద్ధుల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్య కూడళ్ల వద్ద సమాచార బోర్డులు, దిశా నిర్దేశక సూచికలు ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు మార్గదర్శనం అందించనున్నట్లు చెప్పారు.


అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను నియమించి గిరి ప్రదక్షిణ మార్గమంతా నిరంతర పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తాగునీటి పాయింట్లు, వైద్య కేంద్రాలు, విశ్రాంతి ప్రాంతాల వివరాలను ముందుగానే ప్రచారం చేసి భక్తులకు చేరవేయనున్నట్లు తెలిపారు.


గిరి ప్రదక్షిణలో పాల్గొనే ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సౌకర్యవంతమైన, సురక్షితమైన యాత్రను అనుభవించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈవో జల్లేపల్లి వెంకట్రావు స్పష్టం చేశారు.


 దేవస్థానం తరఫున అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసి భక్తులకు ఉత్తమ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.



కార్యనిర్వహణాధికారి

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం

Comments