Skip to main content

గిరిజన మహిళల ఆరోగ్య సంరక్షణకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహాయజ్ఞం- శ్రీకాకుళంలో ‘శ్రీ సత్యసాయి ట్రైబల్ ఉమన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం’కు శ్రీకారం చుట్టిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రఘుపాత్రుని లక్ష్మణరావు*

                     K.V.SHARMA EDITOR 


సత్యసాయి సేవా సంస్థలు జాతీయ స్థాయిలో చేపట్టిన ప్రతిష్ఠాత్మక “శ్రీ సత్యసాయి ట్రైబల్ ఉమన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం” ఈరోజు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం చిన్నమల్లిపురం గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రఘుపాత్రుని లక్ష్మణరావు గారు, శ్రీమతి కమల త్రివేణి గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో మహిళల ఆరోగ్య పరిరక్షణకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయని తెలిపారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం, వైద్యుల సూచనల మేరకు ఉచిత మందులు, ప్రోటీన్ ఫుడ్ కిట్లు అందించడం, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమం ద్వారా గిరిజన మహిళలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 గిరిజన గ్రామాలలో మూడు సంవత్సరాలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.


కార్యక్రమంలో పాల్గొన్న మెడికల్ ఆఫీసర్ శ్రీమతి నంబాల హిమశ్రీ గారు గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు సుమారు 40 మంది మహిళలకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు.

అనంతరం మెలియాపుట్టి మండలం ఆంపురం గిరిజన గ్రామంలో కూడా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమం విశిష్టతను గ్రామస్థులకు వివరించడంతో పాటు గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబద్ధంగా సీమంత కార్యక్రమాలు నిర్వహించి వారికి ఆశీస్సులు అందజేశారు.


ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, మెడికల్ ఈవో, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ సూర రామచంద్రరావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు శ్రీ పప్పల నాగేశ్వరరావు, శ్రీమతి ఎన్. లలిత, శ్రీ కె.వి. రమణమూర్తి, శ్రీ మల్లేశ్వరరావు, శ్రీ బోయిన నరసింహమూర్తి, యోగి మాస్టర్, శ్రీ చంద్రశేఖర్, శ్రీ అన్నం నాయుడు, శ్రీ జగదీష్, శ్రీ విఘ్నేష్, కన్వీనర్లు, సబ్ జోనల్ కన్వీనర్లు, జోనల్ కన్వీనర్లు మరియు జిల్లా పదాధికారులు పాల్గొన్నారు.

Comments