Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. * భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం – పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే షాపులపై కఠిన చర్యలు * లీజు బకాయిలు ఉన్న షాపులను స్వాధీనం చేసుకుంటామని ఈవో జల్లేపల్లి వెంకట్రావు హెచ్చరిక

                  K.V.SHARMA EDITOR 


సింహాచలం, జూన్ 8, 2026 సింహాచలం కొండపై ఉన్న దేవస్థాన షాపింగ్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న దుకాణాల లీజుదారులతో దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సహాయ కార్యనిర్వహణాధికారులు మరియు సంబంధిత విభాగాల అధికారులతో కలిసి షాపుల నిర్వహణ, పరిశుభ్రత, లీజు చెల్లింపులు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, కొండపైకి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు విచ్చేస్తున్న నేపథ్యంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి షాపు నిర్వాహకుడి బాధ్యత అని స్పష్టం చేశారు. పరిశుభ్రత విషయంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ కొంతమంది షాపు నిర్వాహకులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపై షాపుల పరిసరాల్లో చెత్త పేరుకుపోయినట్లు గుర్తిస్తే సంబంధిత షాపులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే షాపులను తాత్కాలికంగా మూసివేసి దేవస్థానం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.

 ప్రతి షాపు వద్ద తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసి, చెత్తను వాటిలోనే వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని లీజుదారులకు సూచించారు. 

అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార అవశేషాలు తదితర చెత్తను నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే పారవేయాలని ఆదేశించారు.


భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు శానిటేషన్ విభాగం అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించడంతో పాటు ఇతర పరిపాలనా చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు.

అదేవిధంగా దేవస్థానానికి చెల్లించాల్సిన నెలవారీ లీజు బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్దేశిత గడువులోగా బకాయిలు చెల్లించని షాపులను దేవస్థానం హ్యాండోవర్ తీసుకుంటుందని స్పష్టం చేశారు. లీజు ఒప్పంద నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని సూచించారు.


భక్తులకు మెరుగైన సేవలు అందించడం, పరిశుభ్రమైన ఆలయ వాతావరణాన్ని కాపాడడం దేవస్థానం ప్రధాన లక్ష్యమని, అందుకు షాపు నిర్వాహకులందరూ సహకరించాలని ఈవో కోరారు.


ఈ సమావేశంలో సహాయ కార్యనిర్వహణాధికారులు వాడ్రేవు రమణమూర్తి, పిల్లా శ్రీనివాసరావు, శానిటేషన్ ఏఈఓ పంతం శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారులు, షాపుల లీజుదారులు పాల్గొన్నారు.

Comments