Skip to main content

ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం: తరచూ తలనొప్పి, మూర్ఛలు, చూపు మందగించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు*

విశాఖ :విశాఖ సందేశం: తరచూ తలనొప్పి వస్తోందా? కారణం లేకుండా వాంతులు అవుతున్నాయా? మూర్ఛలు, చూపు మందగించడం, శరీరంలో ఒక వైపు బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే వాటిని సాధారణ సమస్యలుగా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ ట్యూమర్‌కు సంబంధించిన ప్రారంభ సంకేతాలు కావచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా వైద్య నిపుణులు మాట్లాడుతూ, బ్రెయిన్ ట్యూమర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులోకి రావడంతో బ్రెయిన్ ట్యూమర్ల నిర్ధారణ, చికిత్సలో విశేష పురోగతి సాధ్యమైందన్నారు.

బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో లేదా దాని చుట్టుపక్కల కణజాలంలో ఏర్పడే అసాధారణ కణాల పెరుగుదల. ఇది నిరపాయమైనదైనా, ప్రాణాంతకమైనదైనా మెదడు పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ట్యూమర్ ఉన్న ప్రదేశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. తలనొప్పి, మూర్ఛలు, మాట తడబడటం, జ్ఞాపకశక్తి తగ్గడం, ప్రవర్తనలో మార్పులు, నడకలో అసమతుల్యత, చూపు లేదా వినికిడి సమస్యలు వంటి లక్షణాలు కనిపించవచ్చు.

ఈ సందర్భంగా *డా. తాతినేని సురేష్* , కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ మాట్లాడుతూ, “చాలామంది తలనొప్పిని సాధారణ సమస్యగా భావించి నెలల తరబడి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే తలనొప్పితో పాటు మూర్ఛలు, చూపులో మార్పులు, శరీర బలహీనత వంటి లక్షణాలు ఉంటే వెంటనే నిపుణులను సంప్రదించాలి. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి ఆధునిక పరీక్షల ద్వారా బ్రెయిన్ ట్యూమర్లను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. ప్రస్తుతం మైక్రో న్యూరోసర్జరీ, న్యూరో నావిగేషన్, ఆధునిక రేడియేషన్ థెరపీ వంటి సాంకేతికతలతో అనేక మంది రోగులకు విజయవంతమైన చికిత్స అందించడం సాధ్యమవుతోంది” అని తెలిపారు.

ప్రజలు నరాల సంబంధిత లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్‌ను ముందుగానే గుర్తించి మెరుగైన చికిత్స పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Comments