ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హిందీ సాహిత్య భారతి ఇంటర్నేషనల్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సదస్సు, కవి సమ్మేళనం
విశాఖపట్నం, జూన్ 5, 2026 :హిందీ సాహిత్య భారతి ఇంటర్నేషనల్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సదస్సు మరియు కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమం సరస్వతి వందన, ప్రార్థనలతో ప్రారంభమైంది.
హిందీ సాహిత్య భారతి ఇంటర్నేషనల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రొ. డా. పి.కె. జయలక్ష్మి సభకు విచ్చేసిన అతిథులు, సాహితీవేత్తలు, పాల్గొన్న వారందరికీ స్వాగతం పలుకుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు హిందీ భాషాభివృద్ధి అవసరాన్ని వివరించారు. కార్యక్రమాన్ని డా. టి. హైమావతి సమర్థవంతంగా నిర్వహించారు.
ప్రధాన వక్త శ్రీమతి బి. వారిజ (హిందీ ఆచార్యురాలు, పాడేరు) హిందీ పాత్రికేయ రంగ పితామహుడు పండిత్ యుగల్ కిశోర్ శుక్ల మరియు ఆయన స్థాపించిన చారిత్రక పత్రిక “ఉదంత మార్తండ” గురించి విశదీకరించారు. హిందీ జర్నలిజానికి ఆయన వేసిన పునాది చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆమెను డా. బి. మధుమతి పరిచయం చేశారు.
ముఖ్య అతిథి శ్రీమతి దామరాజు విశాలాక్షి వ్యక్తిత్వ వికాసంపై ప్రభావవంతమైన ఉపన్యాసం చేశారు. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం విజయానికి మూలాధారాలని పేర్కొంటూ యువతకు ప్రేరణనిచ్చారు. ఆమె ప్రసంగం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.
అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో డా. బి. మధుమతి, డా. శాంతి, డా. హైమ, శ్రీ వాసుదేవరావు, శ్రీమతి శ్యామల, డా. రమణమూర్తి, శ్రీమతి రాధారాణి, శ్రీమతి స్వరాజ్య లక్ష్మి తదితరులు పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి ప్రేమ, జల సంరక్షణ, హరిత జీవన విధానం వంటి అంశాలపై తమ కవితలను వినిపించారు.
విశిష్ట అతిథి ప్రసంగంలో డా. ఎస్. కృష్ణబాబు హిందీ జర్నలిజం చరిత్ర, సాహిత్యపు సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతలపై విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రొ. డా. పి.కె. జయలక్ష్మి హిందీ సాహిత్య భారతి ఇంటర్నేషనల్ లక్ష్యాలు, కార్యకలాపాలు, దేశ విదేశాల్లో నిర్వహిస్తున్న సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల గురించి వివరించారు. సంస్థ హిందీ భాష, భారతీయ సంస్కృతి ప్రచారానికి విశేషంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 73 మంది జీవితకాల సభ్యత్వం పొందినట్లు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, కవి సమ్మేళనాలు, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అలాగే హిందీ సాహిత్య భారతి ఇంటర్నేషనల్ జాతీయ అధ్యక్షులు డా. రవీంద్ర శుక్ల గారి దూరదృష్టి, మార్గదర్శకత్వం, సంస్థాభివృద్ధికి అందిస్తున్న విశిష్ట సేవలను ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
చివరగా ప్రొ. డా. పి.కె. జయలక్ష్మి అతిథులు, వక్తలు, కవులు, పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణ మంత్రంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.



Comments
Post a Comment