శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం * శ్రీ స్వామివారి కృష్ణాపురం గోశాలలో ఘనంగా ఏరువాక ఉత్సవం * వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా భూమాత పూజలు, నాగలితో దుక్కి దున్ని విత్తనాల చల్లిన ఆలయఈఓ ...............................జల్లేపల్లి వెంకట్రావు
సింహాచలం, జూన్ 29: 2026 శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జ్యేష్ఠ పౌర్ణమి (ఏరువాక పున్నమి) సందర్భంగా సోమవారం శ్రీ స్వామివారి కృష్ణాపురం గోశాలలో ఏరువాక ఉత్సవాన్ని అత్యంత వైభవంగా, వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని ప్రారంభించి, భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హిందూ సంప్రదాయంలో వ్యవసాయానికి శ్రీకారం చుట్టే పవిత్ర దినంగా భావించే ఏరువాక పున్నమి సందర్భంగా, కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఉషశ్రీ, సన్యాసిరావులతో కలిసి నాగలితో భూమిని దున్ని, విత్తనాలు చల్లి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఈఓ జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, "రైతే దేశానికి వెన్నెముక. రైతు శ్రమ వల్లే ప్రపంచానికి అన్నం లభిస్తుంది. వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగా భావించేవారు. అదే స్ఫూర్తితో వ్యవసాయాన్ని పవిత్ర వృత్తి గా గుర్తిస్తూ జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పూర్ణిమగా జరుపుకుంటున్నాం" అని తెలిపారు.
భూమాతను పూజించి వ్యవసాయ పనులను ప్రారంభించడం భారతీయ సంస్కృతిలో చిరకాలంగా వస్తున్న గొప్ప సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జ్యేష్ఠ నక్షత్రంలో నాగలి పట్టి పనులు ప్రారంభించడం అత్యంత శుభప్రదమని, అందుకే రైతులు వర్షాకాలం ప్రారంభంలో ఎడ్లను శుభ్రపరిచి, వాటి కొమ్ములకు రంగులు పూసి, పూలమాలలు, గజ్జెలతో అలంకరించి, ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించి క్షేత్రపాలకుని ఆశీర్వాదంతో నాగలితో భూమిని దున్ని విత్తనాలు చల్లే సంప్రదాయాన్ని పాటిస్తారని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, సహాయ కార్య నిర్వహణాధికారి వాడ్రేవు రమణమూర్తి డిప్యూటీ ఇంజనీర్ i/c రామరాజు, గోశాల పర్యవేక్షణ అధికారి i/c మూల వాసు, దేవస్థానం జూనియర్ సహాయకులు, సాయి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏరువాక ఉత్సవం సందర్భంగా గోశాల ప్రాంగణం ఆధ్యాత్మిక, సాంప్రదాయ వాతావరణంతో కళకళలాడగా, వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది



Comments
Post a Comment