Skip to main content

హిందీ సాహిత్యభారతి ఆధ్వర్యంలో ఘనంగా “కథాంజలి” పుస్తక ఆవిష్కరణ

.                  K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం: విశాఖ సందేశం వార్తలు: 13 జూన్హి ,హిందీ సాహిత్యభారతి ఆధ్వర్యంలో డా. పి.కె. జయలక్ష్మి రచించిన “కథాంజలి” పుస్తక ఆవిష్కరణ సభ శనివారం సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించబడింది.


ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త, నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత వైస్‌ ఛాన్సలర్‌, గాంధీ సెంటర్ అధ్యక్షులు ఆచార్య వి. బాలమోహన్‌దాస్ అధ్యక్షత వహించారు. కార్యక్రమ ప్రారంభంలో డా. కె. రాజశేఖర్ అతిథులను వేదికపైకి ఆహ్వానించి స్వాగతోపన్యాసం చేశారు.


అనంతరం డా. ఎస్.కృష్ణబాబు హిందీ సాహిత్యభారతి లక్ష్యాలు, ఉద్దేశ్యాలను వివరిస్తూ, ఉత్తరప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి డాక్టర్ రవీంద్ర శుక్లా స్థాపించిన ఈ సంస్థ “వసుధైవ కుటుంబకం” అనే మహోన్నత భావనతో మానవీయ విలువలు, ఆధ్యాత్మిక చైతన్యం, భారతీయ భాషల పరిరక్షణ, ప్రచారం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు.


హిందీ సాహిత్యభారతి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు, సెయింట్ జోసఫ్ కళాశాల ప్రజా సంబంధాల అధికారి డా. పి.కె. జయలక్ష్మి రచించిన “కథాంజలి” పుస్తకాన్ని సభాధ్యక్షులు, ముఖ్య అతిథులు ఆవిష్కరించారు.


ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ డి.వి. సూర్యారావు పుస్తక సమీక్ష నిర్వహిస్తూ, “కథాంజలి”లోని కథలు సమాజంలోని విభిన్న కోణాలను ప్రతిబింబిస్తూ పాఠకులను ఆలోచింపజేస్తాయని తెలిపారు. రచయిత్రి కథన శైలి, సామాజిక స్పృహ, సాహిత్య విలువలను విశ్లేషించారు.


పుస్తక తొలి ప్రతిని శేఖర మంత్రి ప్రభాకర్ స్వీకరించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డా. కనకమహాలక్ష్మి, శ్రీ మల్లాప్రగడ రామారావు, శ్రీమతి దామరాజు విశాలాక్షి తదితరులు ప్రసంగించి రచయిత్రిని అభినందించారు.


డా. పి.కె. జయలక్ష్మి మాట్లాడుతూ, భారతీయ భాషల వికాసం కోసం సంస్థ నిరంతరం కృషి చేస్తోందని, హిందీ సాహిత్యభారతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. సంస్థ నిర్వహిస్తున్న సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు భాషల మధ్య వారధిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే హిందీ సాహిత్యభారతిలో 100 మందికి పైగా శాశ్వత సభ్యత్వం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సభ్యుల సహకారంతో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.


సభాధ్యక్షులు ఆచార్య వి. బాలమోహన్‌దాస్ భారతీయ సంస్కృతి, సాహిత్యం, మానవీయ విలువల ఆధారంగా యువతను తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని వివరించారు. భారతీయ భాషల పరిరక్షణ, యువతలో సాహిత్యాభిరుచిని పెంపొందించాల్సిన అవసరాన్ని వక్తలు నొక్కిచెప్పారు.


కార్యక్రమంలో భాగంగా హిందీ సాహిత్యభారతి నూతన సభ్యుల పరిచయ కార్యక్రమం నిర్వహించి, సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ అనిత, డాక్టర్ హైమ, రాధారాణి, డాక్టర్ మురళీకృష్ణ, ఆదిలక్ష్మి తదితరులు హిందీ సాహిత్యభారతి అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తున్న సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను అభినందించారు.


అనంతరం రచయిత్రి డా. పి.కె. జయలక్ష్మి స్పందిస్తూ, హిందీ సాహిత్యభారతి ప్రతినిధులకు, సభకు విచ్చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సందర్భంగా వక్తలు హిందీ సాహిత్యభారతిని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించి, భారతీయ భాషలు, సంస్కృతి, మానవీయ విలువల ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా ఒక వేదికగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు, విద్యావేత్తలు, భాషాభిమానులు, హిందీ సాహిత్యభారతి సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

Comments