Skip to main content

వర్షాలు పొంచి ఉన్నాయి. కాలువలు పొంగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి. వ్యర్ధాలు దుకాణాల ముందు ఉంటే వ్యర్ధాలు రిటర్న్ గిఫ్ట్ గా తిరిగి ఇవ్వండి. -           జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

             K.V.Sharma editor
విశాఖపట్నం, జూన్ 22: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర పరిధిలోని గెడ్డలు, కాలువలు పొంగకుండా ముందస్తు చర్యలు చేపట్టి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా కాలువలలో పేరుకుపోయిన కూడికలు, వ్యర్ధాలు వెనువెంటనే తొలగించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రజా ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తూర్పు జోన్ 21వ వార్డు పార్క్ హోటల్ జంక్షన్ వద్ద వర్షం కారణంగా కాలువ ఓవర్‌ఫ్లో అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం 18వ వార్డు అప్పుఘర్ ప్రాంతంలోని లుంబిని పార్క్ నుంచి సమతా కాలేజీ వరకు ఉన్న ప్రధాన రహదారిలో పారిశుద్ధ్య పనులు, ఆక్రమణలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ పార్క్ హోటల్ జంక్షన్ వద్ద ఇటీవల కురిసిన  వర్షానికే కాలువలు పొంగి రోడ్లపైకి నీరు రావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో పూడికలు పేరుకుపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని గుర్తించి, వెంటనే కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టాలని, కాలువల వద్ద గ్రేడింగ్లు ఏర్పాటు చేయాలని, ఆ ప్రాంతంలో ఆక్రమణ బట్టిలను తొలగించాలని జోనర్ కమిషనర్ శివప్రసాద్ కు కమిషనర్ ఆదేశించారు.

అనంతరం అప్పుఘర్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తూ సమీపంలో ఉన్న బియ్యం దుకాణం ముందు వ్యర్ధాలు అస్తవ్యస్తంగా ఉండడం గమనించి దుకాణం యజమానికి పదివేల రూపాయలు అపరాధ రుసుము విధిస్తూ ఆ వ్యర్ధాలను ఎత్తించి రిటర్న్ గిఫ్టుగా మరలా దుకాణం లోనే  పోయించారు. ఇకపై వ్యర్ధాలు దుకాణం ముందు కనిపిస్తే దుకాణాన్ని సీజ్ చేస్తామని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రతి దుకాణం ముందు మూడు డస్ట్ బిన్లు దుకాణదారులు ఏర్పాటు చేసుకొని జీవీఎంసీ వ్యర్ధాలు తరలించే వాహనానికి ఆ వ్యర్ధాలను అందించాలని కమిషనర్ ఆదేశించారు.


అప్పుఘర్ ప్రాంతంలో ప్రధాన రహదారిని పరిశీలించిన కమిషనర్, రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్లు, కాలువలు పరిశుభ్రంగా ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల పనితీరు, 


విధుల నిర్వహణ సమయాలను శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయం శానిటరీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో ఎప్పటికప్పుడు పూడికలు తొలగించడం, వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టడం ద్వారా నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.  నగర పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వార్డులో ప్రతి దుకాణం ముందు డస్ట్ బిన్నులు ఉండే విధంగా ఏర్పాటు చేయించాలని 18వ శానిటరీ ఇన్స్పెక్టర్ కనకమహాలక్ష్మిని ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో సహాయక వైద్యాధికారి బి. ప్రసాదరావు సానిటరీ ఇన్స్పెక్టర్ కనకమహాలక్ష్మి, వార్డు శానిటేషన్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి,జివిఎంసి


Comments