Skip to main content

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం * విజయనగరం విద్యార్థుల భోజన వసతి గృహంలో జాయింట్ ఇన్‌స్పెక్షన్ * విద్యార్థులకు మెరుగైన సదుపాయాల కల్పనకు చర్యలు * ఆధునిక కిచెన్, డిష్‌వాషర్లు, వాష్‌రూమ్‌ల మరమ్మతులకు ప్రాధాన్యం

 

                    K.V.SHARMA EDITOR 
సింహాచలం, జూన్ 10: శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం అనుబంధ సంస్థ అయిన విజయనగరం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం విద్యార్థుల భోజన వసతి గృహాన్ని విజయనగరం శాసనసభ్యురాలు  అదితి గజపతి రాజు, సింహాచలందేవస్థానంకార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు సంయుక్తంగా బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంఆర్ కళాశాల ప్రిన్సిపాల్, దేవస్థానం ధర్మకర్త కనకాల మురళీమోహన్, సహాయ కార్యనిర్వహణాధికారి పిల్లా శ్రీనివాస్, ఏఈ తిరుపతిరావు తదితరులతో కలిసి భోజనవసతి గృహంలోని వివిధ విభాగాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, అన్నప్రసాద వితరణ, కిచెన్ నిర్వహణ, పరిశుభ్రత ప్రమాణాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.


ప్రస్తుతం భోజనవసతి గృహంలో ప్రతిరోజూ 400 నుంచి 500 మంది విద్యార్థులు భోజన సౌకర్యాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో, వారికి మరింత మెరుగైన , పరిశుభ్రత సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యంగా అన్నప్రసాద వితరణను మరింత పకడ్బందీగా నిర్వహించడంతో పాటు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

ముఖ్యముగా వాష్‌రూమ్‌ల మరమ్మతులు, ఆధునిక వంటశాల ఏర్పాటు, పరిశుభ్రత ప్రమాణాల పెంపు, విద్యార్థుల భోజన పాత్రలను పరిశుభ్రంగా శుభ్రపరిచేందుకు డిష్‌వాషర్ యంత్రాల ఏర్పాటు, కిచెన్‌లో ఆహార పదార్థాల తయారీ మరియు పంపిణీ ప్రక్రియలను మరింత హైజీనిక్‌గా నిర్వహించే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు సూచించారు.


దేవస్థానం సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్ విధానాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు వేగవంతమైన సేవలు అందించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే ఒకటి రెండు నెలల్లో పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, దేవస్థానం చైర్మన్ ఆమోదం అనంతరం అమలు చేయనున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు కిందిస్థాయి ఉద్యోగులతో నేరుగా మాట్లాడి భోజన వసతి గృహంలో ఉన్న లోటుపాట్లు, సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ జాయింట్ ఇన్‌స్పెక్షన్‌లో దేవస్థానం అధికారులు, ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది, విద్యార్థుల వసతి గృహ నిర్వహణ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఇఓ జల్లేపల్లి వెంకట్రావు  తెలిపారు.

Comments