ఉత్తరాంధ్ర చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న పల్లా శ్రీనివాసరావు, దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద కూటమి నాయకులు సంబరాలు*
కె. వి. శర్మ, ఎడిటర్,
విశాఖపట్నం:,విశాఖ సందేశం : జూన్ 1:*దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్ష సాకారమైన సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు. బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు సైతం ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల నాలుగు దశాబ్దాల కల నేడు సాకారమైందన్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగానే ఈ చారిత్రక ఘట్టం సాధ్యమైందని అన్నారు.
*యువతకు కొత్త అవకాశాలు*
రైల్వే జోన్ ఏర్పాటుతో స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పల్లా తెలిపారు. రైల్వే నియామకాలు, పరిపాలనా వ్యవహారాలు స్థానిక స్థాయిలో మరింత సులభతరం అవుతాయని చెప్పారు. ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తుకు ఇది బలమైన పునాది అవుతుందని అభిప్రాయపడ్డారు.
*పోర్టు ఆధారిత అభివృద్ధికి ఊతం*
విశాఖపట్నం, గంగవరం పోర్టులతో రైల్వే అనుసంధానం మరింత బలోపేతం కావడం ద్వారా సరకు రవాణా సామర్థ్యం పెరుగుతుందని పల్లా పేర్కొన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్య కార్యకలాపాలకు ఇది విశేష ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, గాజువాక బీజేపీ కన్వీనర్ నరసింగరావు, కూటమి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment