Skip to main content

ఇది రాజకీయాలకు సమయం కాదు... బాధిత కుటుంబాలకు అండగా నిలిచి ఉక్కు పరిశ్రమను మరింత బలోపేతం చేయాల్సిన సమయం* *▪️ ఉక్కు కార్మికుల విషాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గం... గొడ్డలి పార్టీ శవ రాజకీయాలు మానుకోవాలి* *▪️ నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఉక్కు పరిశ్రమను లాభాల బాటలో నడిపించింది కూటమి ప్రభుత్వం* *-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు*

.                K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం, జూన్ 10:* విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాద ఘటన అత్యంత దురదృష్టకరమని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమను అటు యాజమాన్యం, ఇటు కార్మికులు కలిసి పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా తీసుకెళ్తున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... విశాఖ ఉక్కు పరిశ్రమ కేవలం ఒక పరిశ్రమ కాదని, తెలుగు ప్రజల త్యాగాలు, పోరాటాలతో నిర్మితమైన ఆత్మగౌరవ చిహ్నమని అన్నారు. ప్రజల ధనంతో రూ.40 వేల కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ కర్మాగారాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గడిచిన 24 ఏళ్లుగా కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పరిశ్రమను నిలబెట్టేందుకు కృషి చేశారని గుర్తుచేశారు.

 *ఉక్కు పరిశ్రమకు ఊపిరి పోసింది కూటమి ప్రభుత్వం* 

గత ప్రభుత్వ హయాంలో ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ మాత్రమే పనిచేసేదని, నేడు మూడు బ్లాస్ట్ ఫర్నెస్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పల్లా తెలిపారు. అప్పట్లో 30 శాతానికి పడిపోయిన ఉత్పత్తి నేడు 95 శాతానికి చేరుకుందని, నెలకు ఆరు లక్షల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రూ.11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ అందించి ఉక్కు పరిశ్రమకు కొత్త ఊపిరి పోసిందన్నారు. అంతకుముందు రూ.3,500 కోట్ల సహాయంతో పరిశ్రమను నిలబెట్టిన ఘనత కూడా ఎన్డీయే ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, ఇతర రూపాల్లో సుమారు రూ.2,600 కోట్ల మేర చేయూత అందించిందన్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం ప్రతి నెలా మొదటి తేదీన సుమారు రూ.100 కోట్ల విద్యుత్ బిల్లులను వసూలు చేస్తూ పరిశ్రమపై అదనపు భారం మోపిందని పేర్కొన్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఉక్కు పరిశ్రమను గట్టెక్కించి లాభాల బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.

 *శవ రాజకీయాలు మానుకోవాలి*

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందో జగన్ రెడ్డి ప్రజలకు చెప్పాలని పల్లా డిమాండ్ చేశారు. ఆయన అధికారంలో ఉన్న కాలంలోనే కార్మికులు నాలుగేళ్లపాటు టెంట్లు వేసుకుని ఉద్యమించారని గుర్తుచేశారు. నేడు స్టీల్ ప్లాంట్‌పై ప్రేమ చూపిస్తున్న వారు అప్పట్లో ఏమి చేశారో విశాఖ ప్రజలు, కార్మికులు మరచిపోలేదన్నారు.

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే ఈ ప్లాంట్ ఈ పాటికే అమ్ముడై ఉండేదన్నారు. నేడు జగన్ రెడ్డి పక్కన నిలబడి మాట్లాడుతున్న కొందరు కార్మిక నాయకులే గతంలో ప్లాంట్‌ను నిలబెట్టేందుకు రూ.3 వేల కోట్ల సహాయం అవసరమని చెప్పారని గుర్తుచేశారు. అలాంటిది కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ అందించి పరిశ్రమకు భరోసా కల్పించిందన్నారు.

విషాద ఘటనను కూడా రాజకీయాలకు వాడుకోవడం అత్యంత దుర్మార్గమని, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి శవ రాజకీయాలకు పాల్పడటం బాధాకరమని పల్లా మండిపడ్డారు. ఉక్కు కార్మికుల కన్నీళ్లపై రాజకీయాలు చేయడం మానుకుని, పరిశ్రమ భవిష్యత్తుపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.

 *బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది* 

ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్పందించి సహాయక చర్యలను వేగవంతం చేశారని తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని, కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాల పునరావాసం, పిల్లల విద్య, భవిష్యత్తు భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని అన్నారు.

మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున సాయం ప్రకటించిందన్నారు. అదనంగా మంత్రి నారా లోకేష్ ప్రకటించిన మేరకు శాశ్వత ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం, కుటుంబ సభ్యుడికి శాశ్వత ఉద్యోగం, పిల్లల విద్యకు పూర్తి సహాయం, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం, కుటుంబ సభ్యుడికి ఉద్యోగం, పిల్లల విద్యకు సహాయం, నివాస సదుపాయాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రకటించిన హామీల అమలులో భాగంగా పరిహారాన్ని బాధిత కుటుంబాల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు.

గత 22 నెలల్లోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని ఐదుసార్లు విశాఖ ఉక్కు పరిశ్రమకు తీసుకువచ్చి పరిస్థితులను వివరించామని, ప్రమాదం జరిగిన వెంటనే ఆయన స్పందించి అదే రాత్రి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి పరిహారం ప్రకటించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

 *పూర్తి సామర్థ్యంతో ఉక్కు పరిశ్రమ... భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం* 

ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్న పరిశ్రమను భవిష్యత్తులో 10 మిలియన్ టన్నుల సామర్థ్యానికి తీసుకెళ్లే దిశగా చర్యలు చేపడతామని పల్లా తెలిపారు. ప్లాంట్‌ను పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి ఎలా తీసుకెళ్లాలి, అందుకు అవసరమైన వనరులను ఎలా సమకూర్చాలన్న దానిపైనే తమ ప్రధాన దృష్టి ఉందన్నారు.

ఇటీవల ప్లాంట్‌ను సందర్శించిన సందర్భంగా పరికరాల నిర్వహణ, సాంకేతిక భద్రత అంశాలపై మరింత శ్రద్ధ అవసరమని గుర్తించామని, సాంకేతిక బృందాలు ఇప్పటికే ఆ దిశగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర సాంకేతిక విచారణతో పాటు భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను మరింత బలోపేతం చేసి పూర్తి సామర్థ్యంతో నడిపించడం, కార్మికుల సంక్షేమాన్ని కాపాడటం, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Comments