శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం. గిరి పౌర్ణమి మహోత్సవాల నిర్వహణపై సమన్వయ సమావేశం.
K.V.SHARMA EDITOR
సింహాచలం, 24 జూన్ 2026 :సింహాచల క్షేత్రంలో జూలై 28, 29 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న గిరి పౌర్ణమి మహోత్సవాల ఏర్పాట్లపై నేడు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొనే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కార్యనిర్వహణాధికారి అధికారులకు సూచించారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, విశ్రాంతి కేంద్రాలు, అన్నప్రసాద పంపిణీ, మొబైల్ టాయిలెట్లు, అత్యవసర సేవలు తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ మార్గంలో ఏర్పాటు చేయనున్న వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్య బృందాలు, తాగునీటి కేంద్రాలు, లైటింగ్ వ్యవస్థ, ట్రాఫిక్ మళ్లింపులు, భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
భక్తులు సౌకర్యవంతంగా గిరి ప్రదక్షిణ నిర్వహించుకునేలా అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని, ప్రతి విభాగం తమకు కేటాయించిన పనులను సమయానుకూలంగా పూర్తి చేయాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.
ఈ సమావేశంలో దేవస్థాన అధికారులు, ఇంజినీరింగ్, ఆరోగ్య, విద్యుత్, ట్రాఫిక్, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొని గిరి పౌర్ణమి మహోత్సవాల విజయవంత నిర్వహణకు తమ సహకారం అందిస్తామని తెలిపారు.


Comments
Post a Comment