రోళ్లపాలెంలో రహదారి వివాదం గ్రామస్తుల రాస్తారోకో... రహదారి అడ్డుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...
అమలాపురం, విశాఖ సందేసం...డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలంలోని రోళ్లపాలెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి ప్రధాన రాకపోకల మార్గంగా నాలుగు దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న చిట్టిగరువు రహదారిపై కొందరు వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. మహిళలు, వృద్ధులు, రైతులు, యువకులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం, గత 40 ఏళ్లుగా ప్రజలు ఈ మార్గాన్నే వినియోగిస్తూ గ్రామానికి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ రహదారిపై వివాదం సృష్టిస్తూ కొందరు వ్యక్తులు ప్రజల సంచార స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. రహదారి మధ్యలో కర్రలు, రాళ్లు, దిమ్మలు, ఇతర అడ్డంకులు ఏర్పాటు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన శవల రాజశేఖర్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు దశాబ్దాలుగా వినియోగిస్తున్న రహదారిని వ్యక్తిగత ఆస్తిగా పేర్కొంటూ కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ దారిలో వెళ్లే వారిని బెదిరించడం, వాహనాలను అడ్డుకోవడం, ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించడం వంటి చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. దీనివల్ల గ్రామ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు.
గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా, అత్యవసర పరిస్థితుల్లోనూ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు వాపోయారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం, రైతులు వ్యవసాయ పనులకు వెళ్లడం, రోగులను ఆసుపత్రులకు తరలించడం వంటి అవసరాలన్నింటికీ ఈ రహదారే ప్రధాన మార్గమని తెలిపారు. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్‌లు సకాలంలో చేరుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా సమస్య కొనసాగుతున్నప్పటికీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపలేదని గ్రామస్తులు ఆరోపించారు. పలుమార్లు రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య అలాగే కొనసాగుతోందని చెప్పారు. ఇటీవల రహదారిని పూర్తిగా మూసివేసే ప్రయత్నం చేయడంతో గ్రామ ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా చందాలు సేకరించి రహదారి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రజల సొంత నిధులతో రహదారిని అభివృద్ధి చేసుకునేందుకు సిద్ధమయ్యామని, దీనికి ఎటువంటి అడ్డంకులు కల్పించకుండా ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించి సమస్యను పూర్తిస్థాయిలో పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. గ్రామస్తులు మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాలుగా ప్రజల వినియోగంలో ఉన్న రహదారిపై వివాదాలకు తెరదించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. రోళ్లపాలెం గ్రామంలో చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజా అవసరాలకు ఉపయోగపడుతున్న రహదారుల విషయంలో అధికారులు త్వరితగతిన స్పందించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని గ్రామ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Comments
Post a Comment