Skip to main content

విశాఖ మేడికవర్ లో రాష్ట్రంలోనే అత్యాధునిక ఇంటర్‌వెన్షనల్ పల్మోనాలజీ సూట్‌ ప్రారంభం......ఐదేళ్లలో 10 వేలకుపైగా బ్రోంకోస్కోపీలు.. పరిశోధన, శిక్షణలోనూ ముందంజూ

.                   K.V.SHARMA EDITOR 
జూలై 27, విశాఖపట్నం.విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలోని మెడికవర్ హాస్పిటల్స్‌లో రాష్ట్రంలోనే అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన "స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇంటర్‌వెన్షనల్ పల్మోనాలజీ సూట్" ద్వారా ఊపిరితిత్తుల వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు పల్మోనాలజీ నిపుణులు డాక్టర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. ఈ సదుపాయం ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. సోమవారం ఉదయం  మెడికవర్ హాస్పిటల్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా డాక్టర్ సుధీర్, డాక్టర్ మోనిష, డాక్టర్ సత్యపద్మజతో కలిసి ఒకే బృందంగా పనిచేస్తూ 24 గంటలపాటు సమగ్ర పల్మోనాలజీ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి క్లిష్టమైన కేసును నిపుణుల బృందం కలిసి విశ్లేషించి చికిత్స నిర్ణయాలు తీసుకోవడం వల్ల రోగులకు మరింత ఖచ్చితమైన, సమర్థవంతమైన వైద్యం అందుతోందన్నారు.

గతంలో కేవలం టిబి, రెస్పిరేటరీ మెడిసిన్‌కే పరిమితమైన పల్మోనాలజీ ప్రస్తుతం స్లీప్ మెడిసిన్, క్రిటికల్ కేర్, ఇంటర్‌వెన్షనల్ పల్మోనాలజీ వంటి ప్రత్యేక విభాగాలుగా విస్తరించిందన్నారు. నిద్రలో శ్వాస ఆగిపోవడం, గురక వంటి సమస్యలకు స్లీప్ స్టడీస్, సీ-ప్యాప్ చికిత్సలు, న్యుమోనియా, హెచ్1ఎన్1, కోవిడ్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటిలేటర్ ఆధారిత చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. కొత్తగా ప్రారంభించిన ఇంటర్‌వెన్షనల్ పల్మోనాలజీ సూట్‌లో బ్రోంకోస్కోపీ ద్వారా ఐసీయూ రోగుల నుంచి నమూనాలు సేకరించి బయోఫైర్ పరీక్షల ద్వారా నాలుగు నుంచి ఆరు గంటల్లోనే ఇన్ఫెక్షన్ కారకాలను గుర్తించే సదుపాయం ఉందన్నారు. దీంతో సరైన యాంటీబయోటిక్ చికిత్సను వెంటనే ప్రారంభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. లంగ్ క్యాన్సర్ నిర్ధారణ కోసం ఎండో బ్రోంకోస్కోపిక్ అల్ట్రాసౌండ్ (EBUS), రేడియల్ ఈబస్ సాంకేతికతలతో ట్యూమర్ల నుంచి సూక్ష్మ నమూనాలు సేకరిస్తున్నామని తెలిపారు. అలాగే ROSE (రాపిడ్ ఆన్ సైట్ ఎవాల్యుయేషన్) విధానం ద్వారా సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజులు పట్టే ప్రాథమిక క్యాన్సర్ నిర్ధారణను కేవలం 20 నుంచి 30 నిమిషాల్లోనే పూర్తిచేస్తున్నామని వెల్లడించారు. జీన్ ప్రొఫైలింగ్ (NGS) ద్వారా క్యాన్సర్‌కు సంబంధించిన జన్యు మార్పులను గుర్తించి టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ఎంపికకు అవసరమైన సమాచారం అందిస్తున్నామని చెప్పారు. రిజిడ్ బ్రోంకోస్కోపీ ద్వారా శ్వాసనాళాల్లోని ట్యూమర్ల తొలగింపు, ఫారిన్ బాడీ తొలగింపు, థొరకోస్కోపీ ద్వారా ఊపిరితిత్తుల్లో నీరు లేదా చీము చేరిన కేసుల్లో బయోప్సీలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆస్తమా తీవ్రతను అంచనా వేసేందుకు పీఎఫ్‌టీ, ఫీనో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి బయోలాజికల్ థెరపీ కూడా అందిస్తున్నామని తెలిపారు.

వైద్య సేవలతో పాటు అకడమిక్, టీచింగ్ కార్యక్రమాలకూ ప్రాధాన్యం ఇస్తున్నామని డాక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం మూడు డీఎన్‌బీ సీట్లు, ముగ్గురు డీఎన్‌బీ రెసిడెంట్లు ఉన్నారని, రాష్ట్రంలోనే తొలిసారిగా పోస్ట్-ఎండీ వైద్యుల కోసం ఇంటర్‌వెన్షనల్ పల్మోనాలజీ ఫెలోషిప్‌ను అందిస్తున్నామని చెప్పారు. ఈ ఫెలోషిప్‌లో ఇద్దరు వైద్యులు ఈబస్, థొరకోస్కోపీ వంటి అధునాతన విధానాల్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం విభాగంలో నలుగురు కన్సల్టెంట్లు, ఒక రిజిస్ట్రార్, ముగ్గురు రెసిడెంట్లు, ఇద్దరు పోస్ట్-ఎండీ ఫెలోస్‌తో కూడిన బృందం నిరంతరాయంగా సేవలు అందిస్తోందన్నారు. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి బ్రాంకోకాన్ సదస్సులో తమ విభాగం నుంచి 14 పోస్టర్లు, ఒక పరిశోధనా పత్రం ప్రజెంటేషన్‌కు ఎంపిక కావడంతో పాటు, తమ రెసిడెంట్లు జాతీయ స్థాయిలో ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించడం గర్వకారణమని ఆయన తెలిపారు.

గత ఐదేళ్లలో 10 వేలకుపైగా రొటీన్ బ్రోంకోస్కోపీలు నిర్వహించామని, 2025-26 సంవత్సరంలోనే దాదాపు మూడు వేల బ్రోంకోస్కోపీలు పూర్తిచేశామని చెప్పారు. అలాగే 1,500కుపైగా కాన్వెక్స్ ఈబస్, వెయ్యికిపైగా రేడియల్ ఈబస్, 300కుపైగా థొరకోస్కోపీలు, 25కుపైగా రిజిడ్ బ్రోంకోస్కోపీలు, సుమారు 20 ఫారిన్ బాడీ రిమూవల్ ప్రొసీజర్లు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఇంటర్‌వెన్షనల్ పల్మోనాలజీ అనేది కేవలం ఓపీ సేవలకు పరిమితం కాని, ఆపరేషన్ థియేటర్, అనస్థీషియా బ్యాకప్‌తో కూడిన అత్యాధునిక వైద్య విభాగమని డాక్టర్ ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. మెడికవర్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్‌వెన్షనల్ పల్మోనాలజీ సూట్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశం లో డాక్టర్ సుధీర్, డాక్టర్ మోనిష , డాక్టర్ సత్యపద్మజ , సెంటర్ హెడ్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...