Skip to main content

తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల* *కూటమి ప్రభుత్వ విధానాలతో ఆదివాసుల రాజ్యాంగ హక్కులకు1/70 చట్టానికి భారీ ముప్పు – గిరిజనులు, మేధావులు మేల్కోవాలి:* *ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి*

.                   K.V . SHARMA EDITOR 
 1/70 చట్టం, జీవో నెం.3, భూ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యంపై రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక చర్చ

విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో గల గిరిజన భవన్‌లో గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన "ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ" రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వ విధానాల కారణంగా ఆదివాసుల రాజ్యాంగబద్ధ హక్కులు, భూ రక్షణ చట్టాలు, ఉద్యోగ రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు ఐక్యంగా పోరాడి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన ప్రత్యేక హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఆమె, 1/70 భూ బదలాయింపు చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకోవాలని, అలాగే జీవో నెం.3 రద్దుతో నష్టపోయిన గిరిజనులకు ప్రత్యామ్నాయ చట్టం ద్వారా న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనులకు కల్పించిన ఉద్యోగ రిజర్వేషన్లు, రాజకీయ హక్కులు, ప్రత్యేక చట్టాల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని కోరారు.

గిరిజన మహిళలను వివాహం చేసుకోవడం లేదా బోగస్ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించడం ద్వారా గిరిజనులకు చెందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలను గిరిజనేతరులు పొందుతున్నారని ఆమె ఆరోపించారు. బోగస్ ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతమంది స్వార్థపరులు, రాజకీయ నాయకులు బినామీ పేర్లతో గిరిజన భూములను ఆక్రమిస్తున్నారని, దీంతో తరతరాలుగా ఆదివాసుల ఆధీనంలో ఉన్న భూములు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


అనంతగిరి మండలంలో వేలాది ఎకరాల గిరిజన భూములు గిరిజనేతరుల ఆధీనంలో ఉన్నాయని, ప్రభుత్వ భూములు కూడా అక్రమ ఆక్రమణలకు గురయ్యాయని పేర్కొన్నారు. గిరిజనులు అధిక సంఖ్యలో నివసించే కొన్ని గ్రామపంచాయతీలను నాన్-షెడ్యూల్ ప్రాంతాలుగా చూపిస్తూ అక్రమ వ్యాపారాలకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు.

అనంతగిరి మండలంలోని ఐదు నాన్-షెడ్యూల్ గ్రామపంచాయతీలను ఐదో షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించాలని, అన్యాక్రాంతమైన గిరిజన భూములను తిరిగి అసలు హక్కుదారులైన ఆదివాసులకే అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన సంఘాల నాయకులు, మేధావులు, న్యాయవాదులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆదివాసుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Comments