Skip to main content

జూలై 30న విడుదలకానున్న ఘట్టమనేని జయకృష్ణ శ్రీనివాస మంగాపురం విశాఖలో సందడి చేసిన చిత్ర యూనిట్ ​*బాబాయ్ మహేష్ బాబు చెప్పిన మెలకువలు ఎంతో ఉపయోగపడ్డాయి: హీరో జయకృష్ణ ​*వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం: హీరోయిన్ రషా తడాని


.               K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తలు :సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, రమేష్ బాబు సుపుత్రుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తడానితో కూడిన చిత్ర యూనిట్ బుధవారం విశాఖపట్నంలో సందడి చేసింది.నోవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో హీరోయిన్లు చిత్ర విశేషాలు పంచుకున్నారు.

​*అభిమానుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి: హీరో జయకృష్ణ*

హీరో జయకృష్ణ మాట్లాడుతూ ఘట్టమనేని కుటుంబంపై, తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. శ్రీనివాస మంగాపురం చిత్రం ఎంతో అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకుల ఆదరణతో సినిమా తప్పకుండా సూపర్ హిట్ సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో తన బాబాయ్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటనకు సంబంధించి చెప్పిన మెలకువలు, టిప్స్ తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని జయకృష్ణ గుర్తుచేసుకున్నారు. అనంతరం సమావేశానికి విచ్చేసిన అభిమానులతో ఆయన నవ్వుతూ ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.

​*అమ్మలాగే నన్నూ ఆదరిస్తారని నమ్ముతున్నా: హీరోయిన్ రషా తడాని*

హీరోయిన్ రషా తడాని మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన తల్లి, ప్రముఖ నటి రవీనా టాండన్‌కు తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, అమ్మలాగే తనను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఇదొక విలక్షణమైన ప్రేమకథని, ఎవరూ ఊహించని రీతిలో కథనంలో ఉండే ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు. థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఒక మంచి లవ్ స్టోరీ చూశామనే సంతోషంతో వస్తారన్నారు.

​విశాఖపట్నం నగరంపై రషా తడాని ప్రశంసల జల్లు కురిపించారు. వైజాగ్ తనకు ఎంతో నచ్చిన ప్రాంతమని, ఇక్కడి సుందరమైన బీచ్, సిటీ వాతావరణం అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. వైజాగ్ ప్రజలు ఎంతో ఆప్యాయతను చూపిస్తారని, వారు చాలా మంచివారని ఆమె తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. జూలై 30న రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.ముందుగా చిత్ర యూనిట్  సింహాచలం శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన వీరికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని, తదుపరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శన సమయంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.దర్శనానంతరం డిఈఓ సింగం రాధ స్వామివారి ప్రసాదాలు అందజేశారు.

Comments