మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 4.0లో పాల్గొన్న ఏపీజెడబ్ల్యూఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్
గాజువాక: గాజువాక నియోజకవర్గం 68వ వార్డు మింది గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 4.0 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్ అతిథిగా పాల్గొన్నారు. 68వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు ఈటి. శ్రీనివాసరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల స్టాళ్లను సందర్శించి వాటి వివరాలను తెలుసుకున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశమై హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జి. శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, కృషి, నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల చదువు, ప్రవర్తన, ప్రతిభను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని ప్రోత్సహించాలని కోరారు.
“పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలి” అని జి. శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు.
68వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు ఈటి. శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల 89 శాతం ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. గత ఏడాది 570గా ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 580కి పెరగడం శుభ పరిణామమని అన్నారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ విద్యారంగంలో చేపడుతున్న ప్రధాన సంస్కరణల్లో ఒక భాగమని పేర్కొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.వి.ఎస్. ఆంజనేయ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోరని అన్నారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. లీప్ యాప్ ద్వారా విద్యార్థుల చదువు, ఫలితాలు, అభ్యసన పురోగతిని తల్లిదండ్రులు తెలుసుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులు ప్రత్యేక బాధ్యత తీసుకుని, పిల్లల భవిష్యత్తు కోసం తగిన సమయం కేటాయించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి.వి.ఎస్. ఆంజనేయ, పి.ఏ.వి. రమణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. అనంతలక్ష్మి, ఉపాధ్యాయులు డి. సత్యనారాయణ, వీ. రమేష్, నర్సింగరావు, నిరూపమ, పరదేశి, గ్రామ పెద్దలు వరీ వెంకట్రావు, సిగటాపు గుర్నాథ్, మంగరాజు, నర్సింగరావు, లక్ష్మి, రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment