Skip to main content

అధికారంలోకి రాగానే ఒక్కో కుటుంబానికి రూ. కోటి ప‌రిహారం - పాడైపోయిన బోటుకి బ‌దులుగా కొత్త బోటును ఇప్పిస్తాం : మ‌త్స్య‌కారుల కుటుంబాల‌కు వైఎస్సార్సీపీ నాయ‌కుల హామీ వైఎస్ జ‌గ‌న్ గారు సంత‌కాలు చేసిన రూ. 49 ల‌క్ష‌ల చెక్కుల‌ను ఏడుగురు మ‌త్స్య‌కారుల కుటుంబాల‌కు అంద‌జేసిన వైఎస్సార్సీపీ నాయ‌కులు. - ప్ర‌భుత్వం స‌కాలంలో స్పందించి ఉంటే ఆ ఆరుగురు ప్రాణాల‌తో మిగిలేవారు - 15 రోజులైనా బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించే తీరిక కూట‌మి నాయ‌కులకు లేదా? - కంటి ఆప‌రేష‌న్ పేరుతో మంత్రి అచ్చెన్నాయుడు కుంటి సాకులు - ప‌రామ‌ర్శ‌కు వ‌చ్చిన‌ జ‌గ‌న్ గారిని తిట్టడానికి మాత్రం ఆప‌రేష‌న్ అడ్డుకాలేదు - వీడియో కాల్ ప‌రామ‌ర్శ‌తో స‌రిపెట్టిన హోంమంత్రి అనిత - మ‌త్స్య‌కారుల జీవితాల‌తో కూట‌మి ప్ర‌భుత్వం ఆట‌లు : ప్ర‌భుత్వ తీరుపై వైఎస్సార్సీపీ నాయ‌కుల మండిపాటు


విశాఖ‌పట్నం: ప్రమాదం జరిగిన వెంట‌నే రెస్క్యూ ఆపరేషన్ చేప‌ట్ట‌కుండా దాదాపు 18 గంట‌ల పాటు ఆలస్యం చేయడం వల్లే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని వైఎస్సార్సీపీ నాయ‌కులు ఆరోపించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి బోటు తిరగబడిన ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు కాగా, 'చిన్నా' అనే మత్స్యకారుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదకర ఘటన జరిగి 15 రోజులు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం, అధికార యంత్రాంగం, స్థానిక మంత్రులు ఇప్ప‌టికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నార‌ని మండిప‌డ్డారు.


 మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గారు స్వయంగా సంతకాలు చేసిన రూ. 7 లక్షల చొప్పున మొత్తం రూ. 49 లక్షల పార్టీ సొంత నిధుల చెక్కులను మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌, విశాఖ జిల్లా అధ్య‌క్షుడు కె.కె.రాజుతోపాటు మాజీ ఎమ్మెల్యేలు వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్‌, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి త‌దిత‌రులు ఆదివారం బాధిత బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వైఎస్సార్సీపీ నాయ‌కులు మాట్లాడుతూ బాధితులను పరామర్శించడానికి కూడా సమయం లేని హోం మంత్రి అనిత, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుల బాధ్యతారాహిత్యాన్ని తీవ్రస్థాయిలో నిలదీశారు. విపత్తు సమయంలో మత్స్యశాఖ మంత్రి ఇంట్లో కూర్చొని 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయడం ఉత్తరాంధ్ర మత్స్యకారులను అవమానించడమేనని ధ్వజమెత్తారు.  కూటమి ప్రభుత్వం కేవలం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో చేతులు దులుపుకోగా, వైఎస్ జగన్ గారు స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచార‌న్నారు. ప్రాణాలతో బయటపడి, జీవనోపాధి అయిన బోటును కోల్పోయి రోదిస్తున్న మత్స్యకారుడు 'చిన్నా'ను కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకార భరోసా, ఆయిల్ సబ్సిడీ, 50 ఏళ్లకే పింఛ‌న్ ఇచ్చి జగన్ గారు మ‌త్స్య‌కారుల‌ను ఆదుకున్నారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధిత కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారంతో పాటు కొత్త బోటును కూడా అందిస్తామని నేతలు హామీ ఇచ్చారు.

ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే... 

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఆరుగురు మ‌త్స్య‌కారుల‌ మృతి 

- గుడివాడ అమరనాథ్, మాజీ మంత్రి బోటు ప్రమాదానికి గురైన వెంటనే సమాచారం ఇచ్చినప్పటికీ, ఫిషరీస్ డిపార్టుమెంట్, అధికార యంత్రాంగం తక్షణమే స్పందించకపోవడం వల్లే ఆరుగురు మ‌త్స్య‌కారులు ప్రాణాలు కోల్పోయారు. ఓదార్చాల్సిన ప్రభుత్వం కనీసం బాధితుల వద్దకు రాకపోగా, ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చిన జగన్ గారి మీద విమర్శలు చేస్తూ కాలం గడుపుతోంది. ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న విపత్తు నిర్వహణ శాఖ మంత్రికి బాధితులను పరామర్శించే తీరిక లేక ఇంట్లో కూర్చొని 'వర్క్ ఫ్రమ్ హోమ్' అనడం సిగ్గుచేటు. మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రోజూ విశాఖపట్నంలోనే తిరుగుతున్నా, పక్కనే ఉన్న జబ్బర్ తోటలోని బాధిత కుటుంబాలను కలవడానికి ఆయనకు సమయం దొరకలేదు. జగన్ గారు మొన్న ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రూ. 7 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రతి కుటుంబానికి అందించాం. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే కూటమి నేతలు సొంతంగా ఒక్క రూపాయి సహాయం చేయకపోగా, ప్రతిపక్షంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలకు రూ. కోటి అందజేసి పూర్తి స్థాయిలో తోడుగా ఉంటాం. జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం, గల్లంతైన వారి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుంది.

కూట‌మి నాయ‌కుల‌కు ప‌రామ‌ర్శించే తీరికే లేదు

- కె.కె. రాజు, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ బోటు ప్రమాదం జరిగిన సమయంలో కూటమి ప్రభుత్వం, రెవెన్యూ యంత్రాంగం, మెరైన్ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సకాలంలో రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని రక్షించడంలో ఘోరంగా విఫలమై, ఆరుగురు మత్స్యకారులు గల్లంతవడానికి కారణమయ్యారు. కష్టకాలంలో బాధలో ఉన్న కుటుంబాలకు అండగా నిలబడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ, స్థానిక హోం మంత్రి అనిత గానీ బాధితులను పరామర్శించడానికి రాకపోవడం చాలా దురదృష్టకరం. మత్స్యకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఈ విషయంలో ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ బాధ్యతారాహిత్యాన్ని చాటుకున్నారు. జగన్ గారు ఈ ఘటన గురించి తెలియగానే చలించిపోయి, విశాఖపట్నం విచ్చేసి బాధిత కుటుంబ సభ్యులందరినీ ఓదార్చి అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం కేవలం రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే, జగన్ గారు మానవత్వంతో తన సొంత నిధుల నుంచి రూ. 7 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. సుమారు రూ. 40 లక్షల విలువైన బోటును, తోటి మత్స్యకారులను కోల్పోయి కుమిలిపోతున్న చిన్నాను ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణం. ప్రతిపక్ష పార్టీగా ఒత్తిడి తెచ్చి కూటమి ప్రభుత్వం ద్వారా ఒకో కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం ఇప్పించే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది.

అధికారంలోకి రాగానే ప్ర‌తి కుటుంబానికి రూ. కోటి ప‌రిహారం 

- వాసుపల్లి గణేష్, మాజీ ఎమ్మెల్యే:

ప్రభుత్వానికి కేవలం జాలి మాత్రమే కాదు, అంతకంటే మిన్నగా సహానుభూతి ఉండాలి. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఆ కనీస బాధ్యత ఎక్కడా కనిపించకపోవడం ముమ్మాటికీ సామాజిక అన్యాయం. రాష్ట్రంలో 950 కిలోమీటర్ల తీరప్రాంతంలో మత్స్యకారులంతా ఎంతో కష్టపడి బతుకుతుంటే, వారి ప్రాణాలన్నా, ఉపాధి పైనా కూట‌మి నాయ‌కుల‌కు చులకనగా మారింది. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆయిల్ సబ్సిడీ పెంచడం, వేట నిషేధ కాలంలో ఇచ్చే భరోసాను రూ. 10 వేలు చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిషింగ్ హార్బర్ జట్టీలను, మత్స్యకారుల కార్పొరేషన్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ అన్నదాతల పొట్టగొడుతున్నారు. ప్రమాదం జరిగి ఇంతమంది మత్స్యకారులు గల్లంతైనా స్థానిక మంత్రులు పరామర్శకు రాకపోవడం దారుణం. సామాజిక న్యాయం కోసం పోరాడే ఏకైక నాయకుడు జగన్  గారు మాత్రమే. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం అందించే జీవోను తీసుకొస్తాం. ప్రాణాలతో బయటపడిన చిన్నాకు కొత్త బోర్డును ఇప్పించే బాధ్యతను కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో తీసుకుంటుంది.

జ‌గ‌న్ ని తిట్ట‌డానికి కంటి ఆప‌రేష‌న్ అడ్డం కాలేదా అచ్చెన్నా..

- వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ

ఈ విషాదకర ఘటన జరిగి 15 రోజులు అవుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు చాలా అమానవీయంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో స్పందించి ఉంటే ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలతో ఉండేవారు, కానీ ప్రభుత్వం వారి ప్రాణాలను గాలిలో దీపాల్లా వదిలేసింది. కూటమి ప్రభుత్వం తూతూమంత్రంగా ఒక్కో కుటుంబానికి కేవలం రూ. 10 లక్షలు ఇచ్చింది, కానీ ఆ మహిళల రోదనలు చూస్తుంటే ఆ మొత్తం వారి పోషణకు ఏమాత్రం సరిపోదు. అందుకే మా జగన్ గారు బాధిత కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు, కూటమి ప్రభుత్వం ఇవ్వకపోతే రేపు మా ప్రభుత్వం రాగానే ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ గారు ఎంతో మానవత్వంతో తన సొంత డబ్బుల నుండి ప్రాణాలతో బయటపడిన చిన్నాతో కలిపి మొత్తం 7 కుటుంబాలకు రూ. 7 లక్షల చొప్పున చెక్కులను పంపించారు. మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కంటి ఆపరేషన్ అంటూ కుంటి సాకులు చెప్తూ ఇంతవరకు ఇక్కడికి రాకపోవడం ఆయన నిర్లక్ష్యానికి పరాకాష్ట. జగనన్న పరామర్శకు వచ్చిన రోజు ప్రెస్ మీట్ పెట్టి తిట్టడానికి లేని కంటి నొప్పి, బాధితులను ఓదార్చడానికి అడ్డు వచ్చిందా అని అడుగుతున్నాను. హోం మంత్రి అనిత పబ్లిసిటీ స్టంట్ లాగా వీడియో కాల్ లో మాట్లాడి చేతులు దులుపుకున్నారు తప్ప క్షేత్రస్థాయికి రాలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు స్పందించి ఆ మత్స్యకార కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి.

జ‌గ‌న్ గారు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు

- బడ్డుకొండ అప్పలనాయుడు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే:

నా నియోజకవర్గంలోని భోగాపురం మండలం, ముక్కాం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకార సోదరులు చనిపోవడం అత్యంత దురదృష్టకరం. ఈ సందర్భంలో మీడియా ఛానల్స్ అన్నీ మానవత్వంతో స్పందించాయి తప్ప, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వానికి గానీ, అధికారులకు గానీ కనీస స్పందన లేదు. నిజంగా మానవత్వం ఉంటే ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలి, కానీ వారు ఆ పని చేయలేదు. జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం రూ. 49 లక్షల రూపాయల చెక్కులను పంపిస్తే ఈరోజు బాధిత కుటుంబాలకు పంపిణీ చేశాం. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత జగన్ గారు 'మత్స్యకార భరోసా' ఇచ్చి మత్స్యకారులపై ఎనలేని ప్రేమ చూపిస్తే, ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటూ అబద్ధపు హామీలతో మోసం చేసింది. ప్రజలంతా ఈ కూటమి పాలనలో మోసపోయామని గ్రహించారు, మళ్లీ జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే మత్స్యకారులకు, మహిళలకు న్యాయం జరుగుతుంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బోటు కోల్పోయిన చిన్నాకు కొత్త బోటును అందించి అన్ని రకాలుగా ఆదుకుంటాం.


ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు  మొల్లి అప్పారావు, మాజీ శాసన సభ్యులు వెంకటరామయ్య,పార్టీ నాయకులు కోలా గురువులు, కట్టమూరి సతీష్, సన్యాసి పాత్రుడు, బాణాల శ్రీనివాసరావు, సతీష్ వర్మ, మంచ నాగ మల్లేశ్వరి, జివి రామచంద్రరావు, ఉమ్మడి స్వాతి, పళ్ళ దుర్గ, లింగం శ్రీను, జాన్ వెస్లీ, పేర్ల  విజయ్ చందర్, చెన్న జానకి రామ్ , అల్లు శంకర్రావు, అంబటి శైలేష్, ఎం సునీల్,కోడిగుడ్ల పూర్ణిమ, బొండా ఉమేశ్వర, దిలీప్, తోట పద్మావతి, సాది పద్మా రెడ్డి, బిపీన్ కుమార్ జైన్, దివ్య కళ, ఈశ్వర్ రావు, పీతల వాసు, ఉమ్మడి కళ్యాణ్, కోడూరు సుశీల , హరికృష్ణ, భోగవల్లి గోవింద్, పద్మశేఖర్, తుల్లీ చంద్రశేఖర్, ఎరంశెట్టి శ్రీనివాస్, సతీష్, మహేష్, అనిల్ శర్మ, కనక ఈశ్వర్ రావు , లాండ్ రమణ, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Comments