Skip to main content

దివ్యధామం పుట్టపర్తిలో చరిత్రాత్మక ఐక్యతా సంబరం-వేలాది మందిలో స్ఫూర్తి నింపిన ‘శ్రీ సత్యసాయి 5కే రన్ & రైడ్ – ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ’ గ్రాండ్ ఫినాలే- ‘ఆరోగ్యకరమైన శరీరమే ఆరోగ్యకరమైన మనస్సుకు ఆధారం’ – శ్రీ ఆర్.జె. రత్నాకర్, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్* *

.                    K.V.SHARMA EDITOR 
పుట్టపర్తి: విశాఖ సందేశం వర్తవాహని :ప్రేమ, సేవ, మానవ ఐక్యత అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శాశ్వత సందేశాన్ని సమాజానికి చాటుతూ ఆధ్యాత్మిక ఉత్సాహంతో ముగిసిన జాతీయ ఉద్యమం

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్యధామమైన పుట్టపర్తి ఆదివారం ఉదయం ఐక్యత, ఆరోగ్యం, భక్తి, నిస్వార్థ సేవల అపూర్వ సంగమానికి వేదికైంది. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భారతదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘శ్రీ సత్యసాయి 5కే రన్ & రైడ్ – ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ’ గ్రాండ్ ఫినాలే అపారమైన ఉత్సాహం, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక భావనల నడుమ ఘనంగా ముగిసింది.


భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం, ‘లవ్ ఆల్ – సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్ – హర్ట్ నెవర్’ అనే భగవాన్ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు శారీరక దృఢత్వం, జాతీయ సమైక్యత, సార్వత్రిక మానవ విలువలను ప్రోత్సహించే మహోద్యమంగా నిలిచింది.

దేశంలోని 45 ప్రధాన నగరాల్లో ఇప్పటివరకు నిర్వహించిన శ్రీ సత్యసాయి రన్ & రైడ్ కార్యక్రమాల్లో 1,20,100 మందికి పైగా పాల్గొనగా, 46వ నగరంగా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో  ఈరోజు  ఆదివారం నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో 19,000 మందికి పైగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ప్రేమ, ఉత్సాహంతో పాల్గొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా 46 నగరాల్లో ఈ మహోద్యమంలో పాల్గొన్న వారి సంఖ్య 1,39,100కు చేరుకుంది.


సుందరమైన శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో భగవాన్ దివ్య సాన్నిధ్యాన్ని స్మరిస్తూ వేలాది మంది రన్నర్లు, సైక్లిస్టులు, భక్తులు, సేవాదళ్ సభ్యులు సమీకరించగా, ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయింది.


శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భారతదేశం అఖిల భారత అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

జ్యోతి ప్రజ్వలన, వేదపఠనంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం వార్మప్, యోగా, డ్రిల్ నిర్వహించి, యూనిటీ రన్ టార్చ్‌ను లాంఛనంగా వెలిగించారు.


మాజీ భారత క్రికెటర్, భారత క్రికెట్ కోచ్ శ్రీ అమోల్ మజుందార్, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్రీ ఎ. శ్యామ్ ప్రసాద్, ఐఏఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీ ఎం . ఎం. భరద్వాజ్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్, పుట్టపర్తి ఆర్డీవో శ్రీమతి పి. సువర్ణ తదితర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


శ్రీమతి హిమవాహిని రత్నాకర్, శ్రీమతి కమలా పాండ్యా, శ్రీ సత్యసాయి సేవా సంస్థల జాతీయ సమన్వయకర్తలు తదితరులు మహిళల రన్ & రైడ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.


‘ఆరోగ్యకరమైన శరీరమే ఆరోగ్యకరమైన మనస్సుకు ఆధారం’ – శ్రీ ఆర్.జె. రత్నాకర్*

శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో సముద్రంలా కనిపించిన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి శ్రీ ఆర్.జె. రత్నాకర్ మాట్లాడుతూ, ఇంతటి ఉత్సాహభరితమైన వాతావరణాన్ని పుట్టపర్తిలో ప్రతిరోజూ చూడగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు.


“ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనస్సుకు దారితీస్తుంది” అని పేర్కొంటూ, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన పూర్వీకుల నుంచి వచ్చిన గొప్ప సంప్రదాయమన్నారు. అయితే నేటి వేగవంతమైన జీవనశైలి, పని ఒత్తిళ్ల కారణంగా వైద్యులు సూచించే వరకు చాలామంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు.


భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధనలను ప్రస్తావిస్తూ, శరీరం ఒక పవిత్రమైన సాధనమని, దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ప్రతిరోజూ కేవలం 15 నుంచి 20 నిమిషాల శారీరక వ్యాయామం చేసినా ఆరోగ్యంపై ఎంతో సానుకూల ప్రభావం ఉంటుందన్నారు. ‘హెల్త్ ఈజ్ వెల్త్’ అన్న నానుడిని గుర్తుచేస్తూ, ఆరోగ్యకరమైన శరీరం ఉన్నప్పుడే మంచి కార్యాలు చేయగలమని, సమాజానికి సమర్థవంతంగా సేవ చేయగలమని తెలిపారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గురించి వివరిస్తూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భారతదేశంలోని 46 నగరాల్లో శ్రీ సత్యసాయి రన్ & రైడ్‌ను నిర్వహించాయని, దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రజలు అపారమైన ఉత్సాహంతో ఇందులో భాగస్వాములయ్యారని తెలిపారు. ఆరోగ్యంపై అవగాహన పెంచే ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులోనూ దేశవ్యాప్తంగా ప్రజలను స్ఫూర్తిపరచాలని ఆకాంక్షించారు.


ఈ సందర్భంగా భగవాన్‌తో తన వ్యక్తిగత అనుభవాన్ని శ్రీ రత్నాకర్ ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు. *భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తన చిన్న గదిలోనే ప్రతిరోజూ దాదాపు 45 నిమిషాలు నడిచేవారని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో తన ఆచరణ ద్వారానే చూపించారని  శ్రీ రత్నాకర్ తెలిపారు*.   

భగవాన్సరీ సత్య సాయి బాబా వారి  జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, ఇటువంటి కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించే ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థలను ఆయన అభినందించారు.

*భగవాన్ ‘లవ్ ఆల్ – సర్వ్ ఆల్’ సందేశానికి సజీవ రూపం – శ్రీ నిమిష్ పాండ్యా*


శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భారతదేశం అఖిల భారత అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని, ఇదే రన్ & రైడ్ కార్యక్రమానికి మూలమైన ‘స్పిరిట్ ఆఫ్ యూనిటీ’ భావనకు నిజమైన ప్రతిబింబమని పేర్కొన్నారు.

ఈ సామూహిక భాగస్వామ్యం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా విశ్వవ్యాప్త సందేశమైన **‘లవ్ ఆల్ – సర్వ్ ఆల్’, నేటి ప్రపంచానికి ఈ సందేశం మరింత అత్యవసరమని  అన్నారు. ఆరోగ్యకరమైన శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు, ఉన్నతమైన భావనతో కూడిన జీవితం వ్యక్తులను సార్థక జీవనానికి నడిపించడంతో పాటు సమాజానికి నిస్వార్థంగా సేవ చేసే శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు.


ఇటువంటి మహోన్నత కార్యక్రమాలు రాబోయే సంవత్సరాల్లో మరెందరికో స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తూ, భగవాన్ దివ్య మార్గదర్శనం, ఆశీస్సులు నిరంతరం అందాలని ఆయన భగవాన్ పాదపద్మాల చెంత ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన పలువురు జాతీయ ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు పాల్గొన్నారు.


*19 వేల మందితో ఐక్యతకు అద్భుత ప్రతిరూపం*గ్రాండ్ ఫినాలేలో పాల్గొన్న 19,000 మంది రన్నర్లు, సైక్లిస్టుల్లో యువత, మహిళలు, విద్యార్థులు, వృత్తి నిపుణులు, సీనియర్ సిటిజన్లు, కుటుంబాలు, భక్తులు సహా సమాజంలోని అన్ని వర్గాల వారు ఉన్నారు. కులం, మతం, భాష, ప్రాంతం వంటి అన్ని భేదాలను అధిగమించి విశ్వమానవ సోదరభావాన్ని చాటాలన్న భగవాన్ దృక్పథానికి ఈ అపూర్వ భాగస్వామ్యం అద్దం పట్టింది.


శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియం నుంచి ప్రారంభమైన 5కే రన్ & రైడ్ పుట్టపర్తి ప్రధాన రహదారుల మీదుగా సాగి తిరిగి స్టేడియానికి చేరుకుంది. మార్గమంతటా సాయి నామస్మరణ, భక్తిగీతాలు, సేవాదళ్ సభ్యులు, భక్తుల ఉత్సాహపూరిత ప్రోత్సాహంతో పుట్టపర్తి ఆధ్యాత్మిక ఆనందోత్సాహంతో పులకించింది.


ఇది కేవలం ఒక క్రీడా కార్యక్రమంగా కాకుండా హృదయాలను కలిపిన మహోద్యమంగా రూపుదిద్దుకుంది. వేసిన ప్రతి అడుగు, తొక్కిన ప్రతి పెడల్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శాశ్వత ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవా సందేశానికి అంకితంగా నిలిచింది.

*పకడ్బందీ ఏర్పాట్లు – సేవాదళ్ నిస్వార్థ సేవ*


గ్రాండ్ ఫినాలే విజయవంతం కావడంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు* నాయకత్వంలో రాష్ట్రంలోని సీనియర్ ఆఫీస్ బేరర్లు, ఇతర బాధ్యులు చేసిన సమగ్ర ఏర్పాట్లు ప్రత్యేకంగా నిలిచాయి. వందలాది మంది సాయి సేవాదళ్ సభ్యులు వినయం, భక్తి, క్రమశిక్షణతో నిస్వార్థ సేవలు అందిస్తూ ప్రతి పాల్గొనేవారికి భద్రత, సౌకర్యం, ఆత్మీయత లభించేలా విశేష కృషి చేశారు.


పాల్గొనేవారి నమోదు నుంచి రూట్ నిర్వహణ, వాలంటీర్ల సమన్వయం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సహాయం, ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్స్ సేవలు, తాగునీటి కేంద్రాలు, రిఫ్రెష్‌మెంట్స్, పారిశుధ్యం, ప్రజా సౌకర్యాల వరకు ప్రతి అంశాన్ని అత్యంత పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా అమలు చేశారు.


దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు పాల్గొనేవారు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు ఆనందం, కృతజ్ఞత వ్యక్తం చేశారు. ఇది కేవలం రన్ లేదా రైడ్ కాదని, భగవాన్ ప్రేమ, సేవా సందేశం కింద వేలాది హృదయాలను ఒక్కటిగా చేసిన ఆధ్యాత్మిక ప్రయాణం అని పలువురు అభివర్ణించారు.


ప్రశాంతి నిలయం దివ్య వాతావరణం, సేవాదళ్ సభ్యుల అసాధారణ అంకితభావం ఈ కార్యక్రమాన్ని జీవితాంతం హృదయాల్లో నిలిచిపోయే మరపురాని అనుభూతిగా మార్చాయని పలువురు పాల్గొనేవారు పేర్కొన్నారు.

శారీరక దృఢత్వాన్ని ఆధ్యాత్మికత, మానవ విలువలు, సమాజ సేవతో ఎంత అద్భుతంగా సమన్వయం చేయవచ్చో ఈ కార్యక్రమం ప్రపంచానికి చాటిచెప్పింది.

ముగింపు కాదు... సరికొత్త సంకల్పానికి నాంది


శ్రీ సత్యసాయి 5కే రన్ & రైడ్ – ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ’ విజయవంతమైన ముగింపు కేవలం దేశవ్యాప్త కార్యక్రమానికి ముగింపు మాత్రమే కాదు

. భగవాన్ శాశ్వత బోధనలను తమ దైనందిన జీవితాల్లో ఆచరిస్తూ, సమాజంలో ప్రేమ, సేవ, ఐక్యతలను విస్తరించాలనే వేలాది మంది స్ఫూర్తిపొందిన హృదయాల నూతన సంకల్పానికి ఇది నాంది.


ఒక అపూర్వమైన ఉదయపు మధుర జ్ఞాపకాలను హృదయాల్లో నింపుకుని వేలాది మంది పుట్టపర్తి నుంచి తిరుగు ప్రయాణమవుతున్న వేళ, ప్రతి హృదయంలో ఒకే భావన ప్రతిధ్వనించింది—ఈ చరిత్రాత్మక మహోద్యమం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అపారమైన దివ్య అనుగ్రహంతోనే సాకారమైంది.

భక్తజన సంద్రం... ఐక్యతా స్ఫూర్తి... పకడ్బందీ నిర్వహణ... చిరునవ్వులతో సేవలందించిన సేవాదళ్... ఉత్సాహంతో పరుగులు తీసిన రన్నర్లు, సైక్లిస్టులు... భక్తిపారవశ్యంతో నిండిన దివ్య వాతావరణం—ఇవన్నీ కలసి పుట్టపర్తి దివ్యధామాన్ని భగవాన్ మహోన్నత సందేశాలైన ‘లవ్ ఆల్ – సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్ – హర్ట్ నెవర్’కు సజీవ రూపంగా నిలిపాయి.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...