ఎండాడ–పనోరమ హిల్స్ మార్గంలో 60 అడుగుల రోడ్డు విస్తరణకు కార్యాచరణ చేపట్టండి. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
K.V.SHARMA EDITOR
విశాఖపట్నం, జూలై 16: నగర అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా చేపట్టనున్న ఎండాడ–పనోరమ హిల్స్ మార్గంలో ప్రతిపాదించిన 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణ పనులకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ షబ్నం శాస్త్రిని ఆదేశించారు.
గురువారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మధురవాడ జోన్ పరిధిలోని ఎండాడ నుంచి పనోరమ హిల్స్ వరకు వి యం ఆర్ డి ఏ అభివృద్ధి చేయనున్న మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతిపాదించిన రోడ్డు విస్తరణ మార్గాన్ని మధురవాడ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు తో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం 40 అడుగుల వెడల్పుతో ఉన్న రహదారిని మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగుల వెడల్పు విస్తరణ చేసేందుకు అవసరమగు అడ్డంకులను వెంటనే తొలగించే కార్యాచరణ చేపట్టాలన్నారు .ఎండాడ నుండి పనోరమ హిల్స్ వరకు వి యం ఆర్ డి ఏ చేపడుతున్న 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణ కారణంగా ప్రభావితమయ్యే ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాలని, ఎన్ని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు,
ఎన్ని స్థలాలు ప్రభావితమవుతాయో క్షుణ్ణంగా సర్వే నిర్వహించాలని, ప్రతి ఆస్తికి సంబంధించిన యాజమాన్య పత్రాలు, ఇతర సంబంధిత రికార్డులను పరిశీలించి పారదర్శకంగా ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. అదేవిధంగా రోడ్డు విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్తులు కోల్పోయే యాజమాన్యం వారికి వివరించి అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, టి పి ఓ తేజేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ




Comments
Post a Comment