విశాఖపట్నం: విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
1958లో స్థాపించబడిన ఈ విద్యాసంస్థ గత 68 ఏళ్లుగా వేలాది మంది మహిళలకు నాణ్యమైన విద్యతో పాటు ధైర్యం, క్రమశిక్షణ, స్వయంనిబద్ధత, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందిస్తూ విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తోందని వక్తలు పేర్కొన్నారు.
వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల అభివృద్ధికి విశేష సేవలందించిన పూర్వ ప్రిన్సిపల్స్ సిస్టర్ సెయింట్ ఆండ్రే, సిస్టర్ జర్మన్ మేరీ, డాక్టర్ సిస్టర్ ఎన్.డి. వెరోనికా, సిస్టర్ అలిస్ మేరీల సేవలను అధ్యాపకులు స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. సిస్టర్ హేమ ప్రసంగిస్తూ, కళాశాల వ్యవస్థాపకుల దూరదృష్టి, విలువలతో కూడిన విద్యా వారసత్వం, మహిళలను ఆదర్శవంతమైన నాయకులుగా తీర్చిదిద్దాలనే వారి సంకల్పాన్ని కొనియాడారు.
ప్రస్తుత ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ నాయకత్వంలో కళాశాల విద్యా, సాంస్కృతిక, పరిశోధనా రంగాల్లో విశేష పురోగతి సాధిస్తోందని స్టూడెంట్ కౌన్సిల్ ముఖ్య సలహాదారు డాక్టర్ సుజాత తన ప్రసంగంలో తెలిపారు. కళాశాల న్యాక్ ‘A’ గ్రేడ్ను కొనసాగించడంతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, గుర్తింపులు, ఐఎస్ఓ సర్టిఫికేషన్లు సాధించిందన్నారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, వర్క్‌షాప్‌లు, అకాడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలను నిరంతరం నిర్వహిస్తూ విద్యా రంగంలో ఆదర్శవంతమైన ప్రగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
పూర్వ ప్రిన్సిపల్స్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన వారిలో ప్రస్తుత ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ, వైస్ ప్రిన్సిపల్ డా. సిస్టర్ హేమ, సిస్టర్లు మేరీ, దీపాలి, జైన్, లత, నాన్సీ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా, కళాశాల మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటూ మహిళా విద్యాభివృద్ధికి మరింత సేవలందించాలని ఆకాంక్షిస్తూ 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ముగించారు.



Comments
Post a Comment