Skip to main content

92వ వార్డులో నూతన సామాజిక భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

.                    K.V.SHARMA EDITOR 
 విశాఖపట్నం, జూలై 16: ప్రజల అవసరాలకు అనుగుణంగా 92వ వార్డులో నూతన సామాజిక భవన నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

గురువారం నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా వెస్ట్ జోన్ పరిధిలోని 92వ వార్డు రామాలయం సమీపంలో శిథిలావస్థకు చేరుకున్న కమ్యూనిటీ హాలును వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ బి.హేమావతి, కార్యనిర్వాహక ఇంజనీరు మాధవరావులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. సామాజిక భవనం ప్రస్తుత పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షించి, స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరల అదే స్థానంలో నూతనంగా నిర్మించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ప్రస్తుత సామాజిక భవనాన్ని పూర్తిగా తొలగించి, ఆధునిక హంగులతో అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన నూతన సామాజిక భవనాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. నూతన సామాజిక భవనం స్థానిక ప్రజలకు సామాజిక, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (PMC)తో సంప్రదించి భవన నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక, డిజైన్‌లు, అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలను త్వరితగతిన సిద్ధం చేసి నివేదికను సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో కార్యనిర్వాహక ఇంజనీరు మాధవరావు , వార్డ్ ఎమినిటీస్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

పౌర సంబంధాల అధికారిజీవీఎంసీ.

Comments