Skip to main content

ఆగస్టు నాటికి రామవరం రైతులకు ప్లాట్లు* *నిర్దిష్ట సమయంలోగా పెండింగ్ టీడీఆర్ ల జారీ* *సమస్యల పరిష్కారానికి మంత్రి నారాయణ ఆదేశం*

.               K.V.SHARMA  EDITOR 
మధురవాడ, జూన్ 30:_ భీమిలి నియోజకవర్గంలో వివిధ సమస్యలకు యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చూపించాలని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోరారు. మంగళవారం మధురవాడ, ఎండాడలలో క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం 


జోనల్ కార్యాలయంలో జీవీఎంసీ, వి.ఎం.ఆర్.డి.ఎ. అధికారులతో మంత్రి పి.నారాయణ సమీక్ష నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్ చేసిన రామవరం రైతులకు ఆగస్టులో ప్లాట్లు అందజేస్తామని వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు పంపిణీ చేసిన తర్వాత వి.ఎం.ఆర్.డి.ఎ. వాటా భూమిలో ప్లాట్ల అభివృద్ధి ప్రారంభిస్తామని, వీటి అమ్మకం ద్వారా రూ.800 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు. ఈ లే అవుట్ లో 80 అడుగులు, 60 అడుగుల రెండు అప్రోచ్ రోడ్ల పనులను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. భీమిలిలో రోడ్ల విస్తరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ సూచించారు. 


పెండింగ్ లో ఉన్న సింహాచలం బి.ఆర్.టి.ఎస్. రోడ్డు, రేవళ్లపాలెం, బక్కన్నపాలెం, శివశక్తినగర్ మాస్టర్ ప్లాన్ రోడ్ల టీడీఆర్ లను నిర్దిష్ట సమయంలోగా జారీ చేయాలని ఆదేశించారు. టీడీఆర్ ల జారీలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని డీటీడీసీపీ విద్యుల్లతతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల విలీనం సాధ్యాసాధ్యాల గురించి చర్చించారు. మధురవాడలో రూ.750 కోట్లతో ప్రతిపాదించిన తాగునీటి ప్రాజెక్టు, రూ.550 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీల ఏ దశలో ఉన్నాయనేది అధికారులు తెలియజేశారు. భీమిలిలో క్రీడాభివృద్ధి కోసం స్టేడియం అభివృద్ధి.. సాగర్ నగర్ సన్ క్యాంపస్ నుంచి ఎండాడ ఎం.కె. వన్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల జాప్యం.. టిడ్కో ఇళ్ల మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ తేజ్ భరత్, అదనపు కమిషనర్ దాట్ల కీర్తి, కార్యదర్శి మురళీకృష్ణ, ఓ.ఎస్.డి. కృష్ణ నాయక్, చీఫ్ ప్లానర్ దివ్యలత, జీవీఎంసీ చీఫ్ సిటి ప్లానర్ ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు వినయ్ కుమార్, సత్యనారాయణ రాజు, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Comments