Skip to main content

బీఎల్‌ఏలే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వెన్నెముక – గ్రామ స్థాయి నుంచి ప్రజా ఉద్యమాలను విస్తరించాలి* *బీఎల్‌ఏల విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి పిలుపు*

.                   K.V.SHARMA EDITOR 
విజయనగరం: విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి పాల్గొన్నారు. సమావేశానికి ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.


ఈ సందర్భంగా డాక్టర్ పాలక్ వర్మ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకోకుండా ప్రతి బూత్ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రజల్లోకి వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, గిరిజన హక్కుల పరిరక్షణ, మహిళల భద్రత, విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు.


విద్యా వ్యవస్థలో పేపర్ లీకేజీలు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని, యువతలో పెరుగుతున్న నిరాశకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేపడుతున్న ప్రజా ఉద్యమాలకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అండగా నిలవాలని పిలుపునిస్తూ, ప్రజలు నేరుగా ఉద్యమాల్లో భాగస్వాములు కావడానికి రూపొందించిన ప్రత్యేక క్యూ ఆర్ కోడ్‌ను విడుదల చేశారు.


అనంతరం బీఎల్‌ఏలకు ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపులపై అభ్యంతరాలు నమోదు చేసే విధానం, బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం. విద్యాసాగర్, జిల్లా, మండల, నగర కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments